Breaking News

నాగర్​ కర్నూల్​లో మల్లు రవికి షాక్​

నాగర్​ కర్నూల్​ లో మల్లు రవికి షాక్​
  • బీఎస్పీలోకి మాజీఎంపీ మందా జగన్నాథం
  • కాంగ్రెస్ కు పెద్ద ఎదురుదెబ్బ
  • ఆర్​ఎస్పీ గెలుపు కోసం మాదిగ ఐక్యవేదిక నేతలు
  • సొంత కేడర్​ ను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్​ అభ్యర్థి
  • తాజా చేపట్టిన రోడ్​ షో అట్టర్​ ప్లాప్​

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈలోపే ఆయా పార్టీల్లో లుకలుకలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున నాగర్ కర్నూల్ పార్లమెంట్​ అభ్యర్థిగా పోటీచేస్తున్న మల్లు రవి ప్రచారంలో కాస్త వెనకబడ్డారని చెప్పొచ్చు. బుధవారం నిర్వహించిన రోడ్​ షో అట్టర్​ ప్లాప్​ అయింది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఎస్సీల్లో మెజారిటీ అయిన మాదిగల ఓట్లు 3.80 లక్షలకు పైగా ఉండగా మాలల ఓట్లు కేవలం రూ.80వేల మాత్రమే ఉన్నాయి. మల్లు రవి మాల సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో మాదిగల ఓట్లు ఈయనకు పడటం కాస్త ఇబ్బందిగానే ఉందని తాజాగా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీ ఎస్సీ వర్గీకరణ అంశంతో ముందుకు రావడం, దానికి ఎమ్మార్పీఎస్​ నాయకులు మద్దతు ఇవ్వడం కొంత పాజిటివ్​ గా మారింది. అయితే ఇప్పటివరకు నాగర్ కర్నూల్ పార్లమెంటు నుంచి మూడుసార్లపైగా ఎంపీగా చేసిన మందా జగన్నాథం నిన్నటివరకు కాంగ్రెస్ లో ఉండటంతో ఆయనపై చాలావరకు ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆయన తాజాగా బహుజన సమాజ్​ పార్టీలో చేరారు. ఇక్కడి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలవడంతో నాగర్ కర్నూల్ పార్లమెంట్ పోరు రసవత్తరంగా మారింది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ, బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీల నుంచి ముగ్గురు మాదిగ అభ్యర్థులే పోటీచేస్తున్నారు. ఒక కాంగ్రెస్ నుంచి మాత్రమే మాల అభ్యర్థి బరిలో ఉండటంతో నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న దాదాపు మాదిగ ఓట్లు ఎక్కువ శాతం ఈ మూడు పార్టీలకు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రానున్న సంకేతాలు జనాల్లో బలంగా ఉండటం, పార్టీ అభ్యర్థి భరత్ ప్రసాద్ తండ్రి పోతుగంటి రాములు నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న పరిచయాలు ఉండటం, ఆయన మాజీ ఎంపీ కావడం, మంత్రిగా పనిచేసి ఉండటం ఇవన్నీ ఆయనకు అనుకూల పరిణామాలుగా మారుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీలో ఉండటం ఆయనకు యువతలో ఉన్న అనుకూలత, మాదిగ ఐక్యవేదిక నుంచి ఆయనకు పెద్దఎత్తున సపోర్టు ఉండటంతో మల్లు రవికి ప్రతికూలంగా మారుతోంది.

రోడ్​ షో అట్టర్​ ప్లాప్​
నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న మల్లు రవి ఇక్కడ మాజీఎంపీ కావడం ఆయనకున్న పరిచయాల దృష్ట్యా పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయనకు సొంత క్యాడర్ ఉంది. దీంతో ప్రస్తుతం ఉన్న క్యాడర్ ను కాదని ఆయన సొంత క్యాడర్ ను ప్రోత్సహిస్తుండటంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కార్యకర్తలు కూడా మల్లు రవి ప్రచారపర్వంలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో చేపట్టిన రోడ్ షోకు జనం కరువయ్యారు. కనీసం రోడ్ షోలో 100 మంది కార్యకర్తలు కూడా లేకపోవడంతో రోడ్​ షో అట్టర్​ ప్లాప్​ అయిందనే చెప్పాలి. దీనికి ముఖ్యకారణం ఆయన ఆయా మండలాలకు నియమించిన ఇంఛార్జ్​ ల వల్లేనని కాంగ్రెస్ కార్యకర్తలు అంతర్గత చర్చించుకుంటున్నారు.