- ఫ్యాన్‌గాలికి కొట్టుకుపోయిన విపక్షాలు
- మిన్నంటిన వైఎస్సార్సీపీ సంబరాలు
తిరుపతి: తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి 2,31,943 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచీ ఆయన ఆధిక్యం కనబరిచారు. వైఎస్సార్ సీపీకి 5,37,152 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీకి 3,05,209 ఓట్లు వచ్చాయి. ఇక జనసేనతో కలిసి ఎన్నికల బరిలో దిగిన బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 50,739, కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ కు 8,477, సీపీఎం అభ్యర్థి నెల్లూరు యాదగిరికి 5,027 ఓట్లు మాత్రమే పడ్డాయి. నోటాకు 13,300ఓట్లు వచ్చాయి. ఎన్నికల ఫలితాల అనంతరం నెల్లూరు డీకేడబ్ల్యు కాలేజీలో రిటర్నింగ్ అధికారి, నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు గురుమూర్తికి డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు.
సీఎం జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటా..
గెలుపు అనంతరం గురుమూర్తి మీడియాతో మాట్లాడారు. తనపై నమ్మకంతో అత్యధిక సంఖ్యలో ఓట్లు వేసి గెలిపించిన తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని ప్రకటించారు. సీఎం ఆధ్వర్యంలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని స్పష్టంచేశారు. పలువురు ప్రముఖులు గురుమూర్తికి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ డాక్టర్ గురుమూర్తి వెంట ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సూళ్లురుపేట ఎమ్మెల్యే సంజీవయ్య ఉన్నారు.