Breaking News

టీఆర్ఎస్ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యం

టీఆర్ఎస్ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యం
  • కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ వల్లే ఓటర్లకు ఫోన్లు, టూర్లు
  • టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి 

సామాజిక సారథి, సంగారెడ్డి:  టీఆర్ఎస్ పార్టీ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యం అయిపోయాయని,  ఉమ్మడి మెదక్ జిల్లాలోని 1027మంది  ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తూర్పు నిర్మలారెడ్డిని గెలిపించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. సంగారెడ్డి పట్టణంలోని ఒక హోటల్ లో మంగళవారం సాయంత్రం డీసీసీ అధ్యక్షురాలు, స్థానిక సంస్థల అభ్యర్థి తూర్పు నిర్మలారెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పోటీలో పెట్టడం వల్లనే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు గౌరవం, విలువ పెరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 230మందితో పాటు టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు పార్టీలకతీతంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూర్పు నిర్మలారెడ్డిని గెలిపించాలని ఏమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న  8అసెంబ్లీ స్థానాలను రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని ఎమ్మెల్యే జగ్గారెడ్డి దీమా వ్యక్తం చేశారు.