- 2.7 క్వింటాళ్ల కాపర్ వైరు స్వాధీనం
సామాజిక సారథి,పెద్దపల్లి: అంతర్ జిల్లా ట్రాన్స్ ఫార్మర్ల దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు టీసీపీ చెన్నూరి రూపేశ్ తెలిపారు. గురువారం పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో మీడియా ముందు నింధితులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసులు 31 ట్రాన్ ఫార్మర్లను దొంగలించిన నిందితులను చాకచక్యంగా పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. గురువారం రోజున ఉదయం నేరస్తుల సంచారం చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు సుల్తానాబాద్ ఎస్సై ఉపేందర్, పోలీస్ సిబ్బంది సుల్తానాబాద్ మండలంలోని కనుకుల వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా కనిపించిన బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముంజంపల్లి గ్రామానికి చెందిన పండరి రఘు, పండరి నరేష్, పండరి వెంకటేశంతో పాటు ధర్మారం మండలం ఖిలావనపర్తికి చెందిన మౌటం కుమారస్వామిలను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల నుంచి 2.07 క్వింటాళ్ల కాపర్ వైరు స్వాధీనం చేసుకొని, విచారణ ప్రారంభించామని తెలిపారు. విచారణలో 9మంది ముఠాగా ఏర్పడి పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ పరిధిలో 18, బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2, అంతర్గాం పోలీస్ స్టేషన్ పరిధిలో 3, సుల్తానాబాద్ లో1, జూలపల్లిలో01, జగిత్యాల జిల్లా వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6 ట్రాన్స్ ఫార్మర్లను చోరీ చేసి అందులోని కాపర్ వైర్ ను అమ్ముకున్నట్లు గుర్తించామన్నారు. అనంతరం బసంత్ నగర్ ఎస్ఐ మహేందర్, ధర్మారం ఎస్సై శ్రీనివాసుల ఆధ్వర్యంలో నాలుగు బృందాలుగా ఏర్పాటు చేసి, మొత్తం తొమ్మిది మంది నిందితులతో పాటు ఇద్దరు కొనుగోలుదారులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి ఒక కారు, ఒక టాటా ఏసీతో పాటు 6ద్విచక్ర వాహనాలు, వేయింగ్ మెషిన్, కాపర్ వైర్ తీసేందుకు ఉపయోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ల చోరీకి పాల్పడిన పండరి రఘు, పండరి నరేష్, పండరి వెంకటేశం, వేంపల్లి సతీష్, ధర్మాజీ ప్రభాకర్, అరుగుల శ్రీకాంత్, ముచ్చర్ల ప్రశాంత్, పండరి రాజేందర్, అరుగుల రజనీకాంత్ తో పాటు కాపర్ వైర్ కొనుగోలు చేసిన మౌటం కుమారస్వామి, పస్తం హనుమంతులను అదుపులోకి తీసుకున్నామన్నారు. గత కొన్ని నెలలుగా పెద్దపెల్లి జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ల చోరీలు పెరగడంతో రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్ (ఐజీ) ఆదేశాల మేరకు పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేన రెడ్డి, పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్ లు ట్రాన్స్ఫార్మర్ల చోరీలపై దృష్టి సారించారన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ, సీఐలను సుల్తానాబాద్ ఎస్సై ఉపేందర్, ధర్మారం ఎస్ఐ శ్రీనివాస్, బసంతనగర్ ఎస్సై మహేందర్, ఏఎస్ఐ తిరుపతి, సిబ్బంది తిరుపతి నాయక్, అనిత్, గణేష్, సుందర్, సతీష్, రవీందర్లను అభినందించారు.