- శ్రీశైలం– హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఘోర ప్రమాదం
- నలుగురు దుర్మరణం.. మృతులంతా యువకులే
- ఎమ్మెల్సీ కసిరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తీవ్ర విచారం
- మృతులు వెల్డండ మండలం పోతేపల్లి, లింగారెడ్డిపల్లి వాసులు
సామాజికసారథి, రంగారెడ్డి బ్యూరో/వెల్డండ: రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు.. నలుగురికి రుచికరమైన వంటలు చేసిపెట్టడమే వారి వృత్తి. ఓ శుభకార్యంలో వంటలు చేసి ఇళ్లకు బయలుదేరిన నలుగురు యువకులు శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్- శ్రీశైలం హైవేపై మహేశ్వరం మండలం తుమ్మలూర్ వద్ద ఈ యాక్సిడెంట్ జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామానికి చెందిన ఇమ్మరాజు రామస్వామి(36), బైకాని యాదయ్య (35), హెచ్. కేశవులు (35), మోత శ్రీను(30) హైదరాబాద్ లోని ఓ శుభకార్యంలో వంట చేసేందుకు వచ్చారు. పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామాలకు వెళ్తున్నారు. తలకొండపల్లి నుంచి హైదరాబాద్ వెళ్తున్న డీసీఎం వాహనం తుమ్మలూర్ వద్ద ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు స్పాట్ లోనే మృతిచెందారు. మరో వ్యక్తి దవాఖానాకు తరలిస్తుండగా చనిపోయాడు. ఈ ఘటనతో పోతేపల్లి, లింగారెడ్డిపల్లి గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. గతకొంతకాలంగా గ్రామానికి చెందిన పలువురు యువకులు ఉపాధి కోసం శుభకార్యాల్లో వంట వృత్తిని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పని కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు విగతజీవులుగా మారారు. ఘటన సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని మృతులు బంధువులు, కుటుంబ సభ్యులు, స్థానికులు, రాజకీయ నాయకులు ధర్నాకు దిగారు. ఈ దుర్ఘటనపై ఎమ్మెల్సీ కసిరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ ఘటనపై మాజీ ఎంపీపీ పుట్ట రాంరెడ్డి, కొప్పు రాజశేఖర్, మాజీ వైస్ ఐజాక్, సర్పంచ్ వెంకటమ్మ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొల్లె ఈశ్వర్ తదితరులు విచారం వ్యక్తం చేశారు. వెల్దండ సింగిల్ విండో వైస్ చైర్మన్ సంజీవ్ యాదవ్ సంఘటన స్థలానికి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. పోలీసులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.