Breaking News

తెల్లారిన బతుకులు

తెల్లారిన బతుకులు
  • శ్రీశైలం– హైదరాబాద్​ ప్రధాన రహదారిపై ఘోర ప్రమాదం
  • నలుగురు దుర్మరణం.. మృతులంతా యువకులే
  • ఎమ్మెల్సీ కసిరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్​ యాదవ్ తీవ్ర విచారం
  • మృతులు వెల్డండ మండలం పోతేపల్లి, లింగారెడ్డిపల్లి వాసులు

సామాజికసారథి, రంగారెడ్డి బ్యూరో/వెల్డండ: రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు.. నలుగురికి రుచికరమైన వంటలు చేసిపెట్టడమే వారి వృత్తి. ఓ శుభకార్యంలో వంటలు చేసి ఇళ్లకు బయలుదేరిన నలుగురు యువకులు శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్​- శ్రీశైలం హైవేపై మహేశ్వరం మండలం తుమ్మలూర్​ వద్ద ఈ యాక్సిడెంట్​ జరిగింది. నాగర్​ కర్నూల్​ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామానికి చెందిన ఇమ్మరాజు రామస్వామి(36), బైకాని యాదయ్య (35), హెచ్.​ కేశవులు (35), మోత శ్రీను(30) హైదరాబాద్​ లోని ఓ శుభకార్యంలో వంట చేసేందుకు వచ్చారు. పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామాలకు వెళ్తున్నారు. తలకొండపల్లి నుంచి హైదరాబాద్​ వెళ్తున్న డీసీఎం వాహనం తుమ్మలూర్​ వద్ద ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు స్పాట్​ లోనే మృతిచెందారు. మరో వ్యక్తి దవాఖానాకు తరలిస్తుండగా చనిపోయాడు. ఈ ఘటనతో పోతేపల్లి, లింగారెడ్డిపల్లి గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. గతకొంతకాలంగా గ్రామానికి చెందిన పలువురు యువకులు ఉపాధి కోసం శుభకార్యాల్లో వంట వృత్తిని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పని కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు విగతజీవులుగా మారారు. ఘటన సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మృతులు

బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని మృతులు బంధువులు, కుటుంబ సభ్యులు, స్థానికులు, రాజకీయ నాయకులు ధర్నాకు దిగారు. ఈ దుర్ఘటనపై ఎమ్మెల్సీ కసిరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్​ యాదవ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ ఘటనపై మాజీ ఎంపీపీ పుట్ట రాంరెడ్డి, కొప్పు రాజశేఖర్​, మాజీ వైస్ ఐజాక్, సర్పంచ్​ వెంకటమ్మ, బీఆర్​ఎస్​ సీనియర్​ నాయకులు బొల్లె ఈశ్వర్​ తదితరులు విచారం వ్యక్తం చేశారు. వెల్దండ సింగిల్​ విండో వైస్​ చైర్మన్​​ సంజీవ్​ యాదవ్​ సంఘటన స్థలానికి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. పోలీసులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.