సారథిన్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ పరిధిలో రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరికి సోకుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలోనే 8వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. చాలామంది మృత్యువాత పడ్డారు. మార్చి నెలలో హైదరాబాద్ నగరంలో 74 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అప్పటి నుంచి వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. ఏప్రిల్ నెలలో 527, మేలో 1,015 నమోదు కాగా, జూన్‌లో మరింతగా విజృంభించాయి. జూన్ నెలలో ఇప్పటి వరకు సుమారు 7వేల దాకా ఈ కేసులు నమోదయ్యాయి. ఈ నెలలో సగటున లెక్కిస్తే రోజుకు 256మంది కరోనా బారిన పడుతున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి కేసులు భారీగా నమోవుతున్నాయి. 17వ తేదీన 214 కేసులు రాగా, 18వ తేదీన 302, 19న 329, 20న 458, 21వ తేదీన 659, 22వ తేదీన 713 కేసులు నమోదయ్యాయి. ఇక 23వ తేదీ కొంత తగ్గి 652 కేసులు నమోదైనా మరునాడే (24వ తేదీ) వాటి సంఖ్య 719కు పెరిగింది. ఇక, గురువారం తెలంగాణలో అత్యధికంగా 920 కేసులు నమోదు కాగా.. హైదరాబాద్ నగరంలోనే 737 కేసులు నమోదయ్యాయి.
ఈ ఒక్కరోజే ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఇలా రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కనీసం హైదరాబాద్ వరకైనా లాక్ విధిస్తుందేమోనని జనం ఆశగా ఎదురుచూశారు. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయమూ వెలువడలేదు. అయితే, కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో వ్యాపారులు భయపడుతున్నారు. దీంతో వారు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ ప్రకటించుకొని దుకాణాలు మూసివేసుకుంటున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు దుకాణాలు మూసివేయాలని ఇప్పటికే హైదరాబాద్ కిరాణా అసోసియేషన్, టెక్స్‌టైల్ ట్రేడ్ అసోసియేషన్లు నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ శానిటరీ డీలర్స్ అసోసియేషన్ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. బేగంబజార్‌లోని దుకాణాలు కూడా ఈ నెల 28నుంచి మూసివేయనున్నారు. ఇంకా అనేక సంస్థలు ఇదే నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాయి. మొత్తానికి ఈ నెల 27వ తేదీ నుంచి అనధికార లాక్‌డౌన్ నగరంలో కనిపించనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి వారు లాక్‌డౌన్ ప్రకటించుకోవడం కన్నా ప్రభుత్వమే హైదరాబాద్ నగరంలో లాక్‌డౌన్ విధించే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం సాగుతున్నది. హైదరాబాద్‌లో పెరుగుతున్న కరోనా కేసులను నియంత్రించాలంటే ఇదొక్కటే మార్గమని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.