- ఎల్బీనగర్ నియోజకవర్గంలో పలు కాలనీలు జలమయం
- ఇబ్బందుల్లో పలు లోతట్టు కాలనీవాసులు
సారథి న్యూస్, ఎల్బీనగర్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్నగరంలో శుక్రవారం రాత్రి కురిసిన కుండపోత వానకు ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని చైతన్యపురి, కర్మన్‌ఘాట్, హస్తినాపురం, హయత్‌నగర్, నాగోల్, మన్సురాబాద్, బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్లలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హయత్ నగర్ లో రోడ్ల వరద నీటి ఉధృతికి కోతకు గురయ్యాయి. మట్టిరోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. లోతట్టు కాలనీల్లోని ఇళ్లలోకి వరదనీరు చేరి వస్తువులన్నీ నీటమునిగాయి. పలువురు బాధితులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వరద బీభత్సానికి కొన్నిచోట్ల రోడ్లు తెగిపోయి గుంతలు ఏర్పడ్డాయి. పలు కాలనీల్లో రాకపోకలు నిలిచాయి. మున్సిపల్ అధికారులు, డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయ చర్యలు చేపడుతున్నా ప్రజలకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు.