Breaking News

సాహితీ శిఖం శ్రీశ్రీ

సాహితీ శిఖం శ్రీశ్రీ

సాహితీ శిఖం శ్రీశ్రీ

20వ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యారు.

విప్లవకవి, సంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా,     విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా సుప్రసిద్ధులు.

శ్రీశ్రీ హేతువాది, నాస్తికుడు,  మహాకవిగా విశేష గుర్తింపు పొందారు. మహాప్రస్థానం ఆయన రచించిన కావ్యాల్లో సుప్రసిద్ధమైంది.

పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు 1910 ఏప్రిల్​ 30న శ్రీశ్రీ జన్మించారు. 1910 సంవత్సరం అన్నది నిజమే అయనా తాను ఏ తేదీన పుట్టారన్నది స్పష్టత లేదు.

శ్రీశ్రీ తాను 1910 ఫిబ్రవరి 1న జన్మించానని విశ్వసించారు.

ఐతే కొందరు మాత్రం సాధారణ నామసంవత్సర చైత్రశుద్ధ షష్ఠినాడు జన్మించారని, అంటే 1910 ఏప్రిల్ 15న జన్మించారని పేర్కొన్నారు.

విశాఖపట్నం మున్సిపాలిటీ వారు ఖరారు చేసిన  ప్రకారం 1910 ఏప్రిల్ 30న పుట్టారని విరసం వారు స్పష్టీకరించారు.

ప్రాథమిక విద్యాభ్యాసం విశాఖపట్టణంలో చదివారు. 1925లో ఎస్​ఎస్​ఎల్​సీ పాసయ్యారు. అదే సంవత్సరం వెంకటరమణమ్మతో వివాహం జరిగింది. 1931 లో మద్రాసు యూనివర్సిటీ నుంచి బీఏ (జంతుశాస్త్రం) పూర్తిచేశారు.

జర్నలిస్టుగా ఉద్యోగప్రస్థానం

1935లో విశాఖలోని ఏవీఎస్‌ కాలేజీలో డిమాన్​ స్ట్రేటర్​గా చేరారు. 1938లో మద్రాసు ఆంధ్రప్రభలో సబ్‌ ఎడిటర్​ గా చేరారు. ఆ తర్వాత ఆకాశవాణి, ఢిల్లీలోనూ, మిలిటరీలోనూ, నిజాం నవాబు వద్ద, ఆంధ్రవాణి పత్రికలోనూ పలు ఉద్యోగాలు చేశారు.

1933 నుంచి 1940 వరకు ఆయన రాసిన మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా.. వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహాప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించారు.

తెలుగు సాహితీదశ, దిశనూ మార్చిన పుస్తకం అది.1947లో మద్రాసుకు తిరిగొచ్చి అక్కడే స్థిరపడ్డారు. తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ మరిన్ని గొప్ప గొప్ప రచనలు చేశారు. ఎన్నో సినిమాలకు పాటలు, మాటలు రాశారు.

పిల్లలు లేకపోవడంతో 1949లో ఓ బాలికను దత్తత తీసుకున్నారు. 1956లో సరోజను రెండవ పెళ్లి చేసుకున్నాడు. రెండవ భార్యకు ముగ్గురు కూతుళ్లు, కొడుకు ఉన్నారు.

సమైక్య నినాదం

1955 సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టుల తరఫున శ్రీశ్రీ చురుగ్గా ప్రచారం నిర్వహించారు. హనుమాన్‌ జంక్షన్ లో ఒక ప్రచారసభలో ఆయన ఆరోగ్యం దెబ్బతిని కొన్ని నెలల పాటు ఆస్పత్రిలో ఉండవలసి వచ్చింది. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలోనూ శ్రీశ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యతో కలిసి ఖమ్మంలో సమైక్యవాదం వినిపిస్తూ ప్రదర్శనలు నిర్వహించారు. ఉద్యమకారుల ప్రదర్శనకు భంగం కలిగించేందుకు యత్నించినా.. తమ ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు.

సాహితీ వ్యాసంగం

శ్రీశ్రీ చిన్న వయసులోనే తన రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టారు. తన 18వ ఏట 1928 లో ‘ప్రభవ’ అనే కావ్య సంపుటిని ప్రచురించారు. ఈ రచనను సంప్రదాయ పద్ధతిలోనే రాశారు. తర్వాతి కాలంలో ప్రదాయిక గ్రాంథికశైలి, ఛందస్సు వంటి వాటిని పక్కన పెట్టి వాడుక భాషలో మాత్రా ఛందస్సులో కవిత్వం రాయడం మొదలుపెట్టారు. ఇది ‘గురజాడ అడుగుజాడ’ చెప్పుకున్నారాయన. 1950 లో మహాప్రస్థానం కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది. మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, బాటసారి, భిక్షువర్షీయసి మొదలైన కవితల సంపుటి అది.

ఆధునిక తెలుగు సాహిత్యంలో ఈ కావ్యం అత్యున్నత స్థానంలో నిలిచి శ్రీశ్రీని మహాకవి చేసింది. తర్వాత మరోప్రస్థానం, ఖడ్గ సృష్టి అనే కవితా సంకలనాలు, చరమరాత్రి అనే కథల సంపుటి, రేడియో నాటికలు రచించారు. మహాప్రస్థానం వంటి గీతాలను మార్క్సిజం దృక్పథంతో రాసినవే అయినా అవి రాసేనాటికి మార్క్సిజం అనేది ఒకటుందని ఆయనను తెలియదు. 1981లో లండన్‌లో ప్రచురితమైన మహాప్రస్థానం ముందుమాటలో ఆయన ఈ విషయాన్ని స్వయంగా రాశారు. అందులో ఇలా ఉంది..

‘..ఈ వాస్తవాలన్నింటికీ నేను స్పందించినా, ఇలాంటి రచనలను ‘సామాజిక వాస్తవికత’ అంటారనీ, దీని వెనుక దన్నుగా మార్క్సిజం అనే దార్శనికత ఒకటి ఉందనీ అప్పటికి నాకు తెలియదు. ఇప్పుడొక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే, మహాప్రస్థాన గీతాల్లోని మార్క్సిస్ట్​ స్ఫూర్తి, సామాజిక స్పృహా యాదృచ్ఛికాలు కావని స్పష్టంగా తెలుస్తోంది.’ తెలుగు వారిని ఉర్రూతలూగించిన ఎన్నో గొప్ప సినిమా పాటలను ఆయన రచించారు. అల్లూరి సీతారామరాజు సినిమాకు అతను రాసిన ‘తెలుగు వీరలేవరా..’ అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి. రెండవ భార్య సరోజతో కలిసి సినిమాలకు మాటలు రాశారు.

‘ఓ వ్యథానివిష్టులారా! ఓ కథావశిష్టులారా! పతితులారా! భ్రష్టులారా! బాధా సర్పదష్టులారా! ఏడవకం డేడవకండి.. వస్తున్నా యొస్తు న్నాయ్‌ జగన్నాథ రథచక్రాల్‌ ‘ అంటూ, పదండి ముందుకు, పదండి తోసుకు మరోప్రపంచం పిలిచిందని, నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను’ అని తన మహాప్రస్థానంలో అభ్యుదయ కవిత్వమూ, విప్లవ బీజాలు రగిలించారు. ప్రాస, శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పాక్షరాల్లో అనల్పార్థాన్ని సృష్టించడంలో ఇప్పటికీ మేటి. ‘వ్యక్తికి బహువచనం శక్తి’ అనేది ఆయన సృజించిన మహత్తర వాక్యమే.

శబ్దప్రయోగంలో నవ్యతను  చూపించారు. ప్రగతి వారపత్రికలో ప్రశ్నలు, జవాబులు(ప్రజ) అనే శీర్షిక నిర్వహించారు. పాఠకుల ప్రశ్నలకు సమాధానాలిచ్చే శీర్షిక అది. చతురోక్తులు, శ్లేషలతో కూడిన ఈ శీర్షిక అప్పట్లో బహుళ ప్రాచుర్యం పొందింది. నాటి తెలుగు సాహిత్యంలో రాయప్రోలు సుబ్బారావు, నండూరి సుబ్బారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ లాంటి కవులు ఉన్న   ఆ సమయంలోనే శ్రీశ్రీ అచ్చమైన భావ కవిత్వాన్ని రచించారు.

అరసం, విరసం.. నాయకత్వం

పలు దేశాల్లో ఎన్నోమార్లు పర్యటించారు. ఎన్నో పురస్కారాలు పొందారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి రాజాలక్ష్మీ ఫౌండేషన్​ అవార్డు పొందారు. అభ్యుదయ రచయితల సంఘానికి (అరసం) అధ్యక్షుడిగా పనిచేశారు. 1970లో అతని షష్టిపూర్తి ఉత్సవం విశాఖపట్టణంలో జరిగింది. ఆ సందర్భంలోనే ఆయన నాయకత్వంలోనే విప్లవ రచయితల సంఘం(విరసం) ఏర్పడింది. కొంతకాలం పాటు కేన్సర్​ వ్యాధికి గురై 1983 జూన్ 15న శ్రీశ్రీ మరణించారు. సాహితీలోకంలో వేగుచుక్కగా నిలిచారు. విశాఖపట్టణంలోని బీచ్ రోడ్డులో శ్రీశ్రీ నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

–ఆర్​కే..

97050 90846