Breaking News

మద్యం ఆదాయమే మస్త్​

మద్యం ఆదాయమే మస్త్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా దెబ్బకు ప్రపంచమే తలకిందులైంది. ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదిగామని భావిస్తున్న దేశాలు కూడా వైరస్‌ కాటుకు కకావికలమయ్యాయి. అందులో తెలంగాణ ప్రభుత్వం కూడా ఒకటి. లాక్‌డౌన్‌ కాలంలో పరిశ్రమలు, దుకాణాలతో పాటు అన్నిరంగాలు మూసివేశారు. దీంతో వ్యాపారం జరగలేదు. రాష్ట్రానికి రావాల్సిన పన్నులు కూడా రావడం లేదు. ఉన్న డబ్బంతా ఊడ్చుకుపోయింది. దీంతో ప్రభుత్వం ఉద్యోగుల జీతాల్లో కూడా కోత విధించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, ఇప్పుడు లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. అయినా, ప్రభుత్వానికి రావాల్సినంత ఆదాయం రావడం లేదు. పూర్తిస్థాయిలో ఆర్థికంగా రాష్ట్రం కోలుకోలేదు. కానీ, కొంత నిలదొక్కుకునే స్థితిలోకి వచ్చింది. అయితే, సర్కారుకు ఇప్పుడు అండగా నిలిచింది ఏమిటో తెలుసా..? అదే మద్యం. కేవలం మద్యం అమ్మకాల ద్వారానే ఎక్కువగా రాష్ట్ర సర్కారుకు ఆదాయం వస్తుందట. అది కూడా హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారని ప్రచారం జరగడంతో మద్యం అమ్మకాలకు మళ్లీ ఊపు వచ్చింది. భారీగా కొనుగోళ్లు జరుగుతుండడంతో సర్కారు బొక్కసానికి ఆదాయం కూడా కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుందట.

మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారని..

హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారన్న ప్రచారం జరగడంతో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. జూన్‌ 26 నుంచి 30 మధ్య రూ.9,73.61 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. జూలై 1 నుంచి లాక్‌డౌన్‌ విధిస్తే, ఎక్కడ షాపులు మూత పడతాయేమోనన్న కంగారుతో మందుబాబులు పెద్ద మొత్తంలో మద్యం కొని నిల్వ చేసుకున్నారు. ఇదే తెలంగాణ సర్కారుకు బాసటగా నిలుస్తోంది. రిజిస్ట్రేషన్లు, జీఎస్‌టీ రాబడుల కంటే మద్యం విక్రయాలే ఎక్కువ ఊరట కలిగిస్తున్నాయి. గత ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.4,997.81 కోట్ల రాబడి సమకూరింది. జూన్‌ నెలాఖరులో అమ్మకాలు గణనీయంగా పెరగ్గా ఈనెల 1 నుంచి 4వ తేదీ వరకు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే అమ్మకాలు ఉన్నాయి. లాక్‌డౌన్‌ తర్వాత మే 6 నుంచి 31 వరకు సాగిన విక్రయాల్లో రూ.1,864 కోట్ల రాబడి వచ్చింది. జూన్‌లో రూ.1,955 కోట్ల ఆదాయం సమకూరింది.

హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతుండడంతో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో మద్యం దొరక్క ఎదుర్కొన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మందు బాబులు మద్యం కొనుగోలు కోసం ఎగబడ్డారు. సాధారణ రోజుల్లో బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మద్యం డిపోల నుంచి వైన్‌ షాపు ఓనర్లు రోజుకు రూ.70కోట్ల నుంచి రూ.75 కోట్ల మద్యం, బీరును లిఫ్ట్‌ చేస్తుంటారు. కానీ జూన్‌ 26 నుంచి 30వ తేదీ వరకు 27వ తేదీన మినహా మిగతా నాలుగు రోజుల్లో రూ.150 కోట్లకు పైగానే విక్రయాలు సాగాయి. ఇక జూలై 1 నుంచి 4వ తేదీ వరకు కూడా విక్రయాలు బాగానే జరిగాయి. ఈ రోజుల్లో ప్రతిరోజూ రూ.75 కోట్లకు పైగానే విక్రయాలు సాగడం గమనార్హం.