న్యూఢిల్లీ: మైదానం లోపలా, వెలుపలా ఎలా ఉండాలి.. ఎలా ప్రవర్తించాలో లెజెండరీలు సచిన్, ధోనీ, కోహ్లీని చూసి నేర్చుకోవాలని పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్ కు అతని సోదరుడు కమ్రాన్ అక్మల్ సూచించాడు. ‘ఉమర్ కు నేనిచ్చే సలహా ఒక్కటే. నిజంగా తప్పు చేసి ఉంటే దానిని నుంచి పాఠం నేర్చుకోవాలి.
జీవితమన్నాక చాలా ఆటంకాలు ఎదురవుతాయి. సచిన్, ధోనీ, కోహ్లీ లాంటి వాళ్లను స్ఫూర్తిగా తీసుకోవాలి. కోహ్లీని తీసుకుంటే ఐపీఎల్ ప్రారంభంలో ఒకలా ఉండేవాడు. ఆ తర్వాత చాలా మారిపోయాడు. వరల్డ్ నంబర్ వన్ బ్యాట్స్ మెన్ స్థాయికి ఎదిగాడు. ధోనీ జట్టును నడిపించిన తీరు చూసి చాలా నేర్చుకోవచ్చు. ఇక సచిన్ పాజీ వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉంటాడు.
మన టీమ్ లోని బాబర్ అజమ్ కూడా ఓ ఉదాహరణే. ప్రస్తుతం వరల్డ్ టాప్–3లో ఉన్నాడు. వాళ్లందరినీ చూసి ఎలా మసలుకోవాలో నేర్చుకోవాలి. వాళ్ల దృష్టింతా ఎప్పుడూ ఆటపైనే ఉంటుంది. అభిమానులు, ఆటకు అంబాసిడర్లుగా నిలుస్తారు. వాళ్లను ఉదాహరణగా తీసుకుని ఆ బాటలోనే మనం నడవాలి.
అంతేకాక మీడియాలో వచ్చినట్టు ఉమర్ తప్పులు చేసి ఉండడు. ఫిక్సర్ల సమాచారం ఆలస్యంగా చెప్పి ఉండొచ్చు. కానీ శిక్ష విషయంలో పీసీబీ అందరినీ సమదృష్టితో చూడాల్సింది. క్రికెట్ ను నమ్ముకోని జీవిస్తున్నాం. ఉమర్ కు మరింత సపోర్ట్ అవసరం’ అని కమ్రాన్ చెప్పుకొచ్చాడు.