- వర్షాలు, వరదలు వస్తున్నందున జాగ్రత్తగా ఉండండి
- సహాయక చర్యలకు ఎంతఖర్చయినా వెనుకాడొద్దు
- ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి
- ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు, వరదలు సంభవిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణ, ఆస్తినష్టం సంభవించకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రజాప్రతినిధులు, అధికారులను ఆదేశించారు. ఏ ఒక్కరి ప్రాణం పోకుండా కాపాడడమే ప్రధాన లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని ఆదేశించారు. సహాయక చర్యలు చేపట్టడానికి ఎంతఖర్చు పెట్టడానికైనా వెనుకాడవద్దని, అవసరమైనన్ని నిధులు సిద్ధంగా ఉన్నాయని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో వానలు, వరదలు, వాటివల్ల తలెత్తిన పరిస్థితులపై సీఎం కేసీఆర్ సోమవారం హైదరాబాద్ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లాల వారీగా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో భారీవర్షాలతో పాటు వరదల ఉధృతి కొనసాగుతున్ననేపథ్యంలో అక్కడి పరిస్థితిని సీఎం ప్రత్యేకంగా సమీక్షించారు. నాలుగైదు రోజులుగా భారీవర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని చెరువులు నిండాయి. అన్ని జలాశయాల్లో నీరు వస్తోంది. నదులు, వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఇప్పటివరకు పరిస్థితి అదుపులోనే ఉంది. కానీ రాబోయే మూడు నాలుగు రోజులు కూడా చాలా ముఖ్యమని సూచించారు. ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఈనెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. మరోవైపు గోదావరి, కృష్ణా, తుంగభద్ర, ప్రాణహిత, ఇంద్రావతి నదులకు నీరందించే క్యాచ్ మెంట్ ఏరియా కలిగిన ఎగువ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయని, వరదలు వచ్చే అవకాశం ఉందన్నారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు
– ఎంత విపత్తు వచ్చినా సరే ప్రాణనష్టం జరగవద్దనేదే ప్రభుత్వ లక్ష్యం. ఇతరత్రా నష్టాలు సంభవిస్తే ఏదోలా పూడ్చుకునే అవకాశం ఉంది. కానీ, ప్రాణాలు తిరిగి తేలేం. కాబట్టి విపత్తు నిర్వహణలో ప్రాణాలు కాపాడడమే అత్యంత ప్రధానమనే విషయాన్ని అధికార యంత్రాంగం గుర్తించాలి. దానికి అనుగుణంగా పనిచేయాలి. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి.
–గోదావరి నదికి భారీ వరద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏటూరు నాగారం, మంగపేట మండలాలతో పాటు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఉండే ముంపు గ్రామాలను గుర్తించి అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.
– గోదావరికి భారీ వరద వస్తే భద్రాచలం పట్టణానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి భద్రాచలం పట్టణంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.నీటి ముంపు పొంచి ఉన్న ప్రాంతాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలి. ఈ శిబిరాల్లో అందరికీ కావాల్సిన వసతి, భోజనం ఏర్పాటు చేయాలి. కోవిడ్ నుంచి రక్షణ కోసం మాస్కులు, శానిటైజర్లు అందించాలి.
–మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఎక్కడికక్కడే ఉండి తమ ప్రాంతాల్లో సహాయ చర్యలను పర్యవేక్షించాలి.
–వర్షాలు, వరదల వల్ల జరిగిన పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు తయారుచేయాలి.
-పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులు ప్రతిరోజు పట్టణం, గ్రామం నుంచి తాజా పరిస్థితిపై నివేదిక తెప్పించుకోవాలి. ఆ నివేదిక కలెక్టర్ల ద్వారా కార్యదర్శికి, అక్కడి నుంచి ప్రధాన కార్యదర్శికి చేరాలి.
–అన్ని నదుల వద్ద ఫ్లడ్ ట్రాక్ షీట్ తయారు చేయాలి. నదుల్లో నీటి ప్రవాహం ఎక్కువైతే జరిగే పరిణామాలను అంచనా వేయాలి. ఫ్లడ్ మేనేజ్మెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ తయారు కావాలి. రాష్ట్ర రాజధానితో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు 24 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగాలి.
మంత్రులు మహమూద్ అలీ, కె.తారక రామారావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎంవో ముఖ్యకారదర్శి నర్సింగరావు, కార్యదర్శులు భూపాల్ రెడ్డి, స్మితా సబర్వాల్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, రైతుబంధుసమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు.