Breaking News

వక్ఫ్‌బోర్డు భూములు అమ్మేశారు

వక్ఫ్‌బోర్డు భూములు అమ్మేశారు

సారథి న్యూస్​, కర్నూలు: గత ప్రభుత్వం నిర్లక్ష్యం పాలకుల కక్కుర్తి కారణంగా ఓ వర్గానికి చెందిన వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయని కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నవరత్నాల్లో భాగంగా వక్ఫ్‌బోర్డు భూములు పరిరక్షణకు కృషిచేస్తానని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. వక్ఫ్‌బోర్డు భూములు కబ్జాకు గురయ్యాయని ఫిర్యాదు అందడంతో ఆదివారం ఏపీ వక్ఫ్‌బోర్డు సీవో ఆలీబాషాతో కలిసి ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, ఎంఏ హఫీజ్‌ఖాన్‌, డాక్టర్​ సుధాకర్‌ కర్నూలులోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ముజాఫర్‌నగర్‌, సంతోష్‌నగర్‌, ఉల్చాల, మామిదాలపాడు, సమ్మర్‌ స్టోరేజీ, సంతోష్‌ నగర్‌ ఈద్గా వెనక ఉన్న భాగంలోని వక్ఫ్‌బోర్డు భూమును పరిశీలించారు. కర్నూలులో 14వేల ఎకరాలు వక్ఫ్‌బోర్డు భూములు ఉన్నాయని, అందులో నాలుగువేల ఎకరాల్లో అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోందన్నారు. పచ్చపార్టీ నాయకులు అన్ని వ్యవస్థల్లోనూ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, తమ ప్రభుత్వం చేపడుతున్న విచారణలో ఒక్కొక్కటి బయటకు వస్తుందన్నారు.
అవినీతి రహిత పాలనకు ప్రాధాన్యం
పారదర్శకత, అవినీతి రహిత పాలన అందించడమే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ పునరుద్ఘాటించారు. భూములు కబ్జాకు గురికాకుండా ప్రత్యేకచర్యలు తీసుకుంటున్నారని, ఎవరైనా ఆక్రమణకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళా అభ్యున్నతే ధ్యేయంగా వైఎస్సార్‌ చేయూత, ఆసరా తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, ఎంఏ హఫీజ్‌ఖాన్‌, డాక్టర్​ సుధాకర్‌ అన్నారు. పర్యటనలో హజ్‌ కమిటీ ఈవో ఎల్‌.అబ్దుల్‌ ఖాదర్‌, డిప్యూటీ సెక్రటరీ షేక్‌ అహ్మద్‌, అసిస్టెంట్‌ సెక్రటరీ ఎస్‌ఏ మన్సూర్‌ పాల్గొన్నారు.