Breaking News

రైతన్నలూ.. జరభద్రం

రైతన్నలు జర పైలం

సారథిన్యూస్​, రామాయంపేట: పంటలకు చీడపీడలు ఆశించకుండా రైతన్నలు క్రిమిసంహారక మందులు పిచికారి చేయడం సహజమే. అయితే ఈ సమయంలో అన్నదాతలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయశాఖ నిపుణులు సూచిస్తున్నారు. పురుగుమందులు మనిషి శరీరాన్ని తాకినా పొరపాటున శరీరంలోకి వెళ్లినా ఎంతో ప్రమాదం. వ్యవసాయ అధికారుల సూచన మేరకు వారు చెప్పిన మోతాదులోనే క్రిమిసంహారక మందులు పిచికారి చేయాలి. పంట మొక్కల స్థాయిని బట్టి స్ప్రే డబ్బాలను ఉపయోగించాలి. పత్తి పంటలో హ్యాండ్​ పంపుకు బదులు తైవాన్​, పవర్​ స్ప్రేయర్లను వినియోగించాలి. పంటకు సోకిన తెగులును, లేదా పురుగు గుడ్లను వ్యవసాయాధికారులకు చూపించి అందుకనుగుణంగా వారి సూచనల మేరకు మందులు వాడాలి. మోతాదును మించి మందులు పిచికారీ చేయడం వల్ల మిత్ర పురుగులు చనిపోయే అవకాశం ఉంటుంది.
రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పురుగుల మందు డబ్బా మూతను నోటితో తీయరాదు. మందు ద్రావణాన్ని చేతితో కలపొద్దు.
మందును దఫాల వారిగా కాకుండా ఒకేసారి కలుపుకోవాలి. చేతులకు గ్లౌజులు, మొహానికి మాస్క్, తలకు రుమాలు లేదా టోపీని ధరించాలి. గాలి ఎదురుగా వస్తున్న దశలో మందు స్ప్రే చేయరాదు. మందు స్ప్రే చేస్తున్న టైం లో పొగ తాగడం, తినడం, చేతులను నోట్లో పెట్టుకోవడం వంటివి చేయొద్దు. రైతుకు తలతిరగడం, వాంతులు వంటివి అయితే వెంటనే డాక్టర్​ను సంప్రదించాలి. మూర్చబోయిన సమయంలో మూతికి దెబ్బ తగలకుండా రెండు దవడాల మధ్య ఒక మంచి పొడి గుడ్డను ఉంచాలి. రైతు శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు తడి బట్టతో తుడవాలి.