Breaking News

మెదక్​లో కరోనా పంజా

సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో కరోనా పంజా విసురుతోంది. మూడు నెలల్లో 14 నమోదు కాగా, మంగళవారం ఒకేరోజు 14 మందికి పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. పదిరోజుల్లో మెదక్, రామాయంపేట, తూప్రాన్, చేగుంట, కొండపాకకు చెందిన పలువురికి కరోనా వైరస్​ సోకింది. ఈ క్రమంలో వైద్యారోగ్యశాఖ అధికారులు పాజిటివ్ నిర్ధారణ అయిన వారి ప్రైమరీ కాంటాక్ట్ మెంబర్ల శాంపిళ్లను సేకరించి టెస్టుకు పంపించారు. మంగళవారం 14మందికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది. మెదక్ పట్టణం వాసవినగర్ కు చెందిన ఓ వ్యాపారికి వారంరోజుల క్రితం కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలగా, ఇప్పుడు ఆయన భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు, తల్లికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. అలాగే మెదక్ గురుకుల స్కూలులో ఏఎన్ఎంగా పనిచేసే మహిళ భర్తకు కూడా కరోనా వైరస్ ప్రబలింది. తూప్రాన్ పట్టణంలో కరోనా బారినపడి సోమవారం మరణించిన వ్యాపారి భార్య, కొడుకులకు కరోనా నిర్ధారణ అయింది. తూప్రాన్ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే ఇద్దరు కాంట్రాక్టు డాక్టర్లు, వారి తల్లిదండ్రులకు మహమ్మారి అంటుకుంది. పాపన్నపేట మండలం నాగసాన్​పల్లిలో విధులు నిర్వర్తించే ఏఎన్ఎంకు కూడా కోవిడ్ నిర్ధారణ అయిందని డీఎంహెచ్ వో డాక్టర్ వెంకటేశ్వర్ రావు వివరించారు.
భారీగా పెరిగిన కేసులు
జిల్లాలో లాక్ డౌన్ కు ముందు కేవలం ఐదు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు కాగా, లాక్ డౌన్ సడలింపు తర్వాత 9 కేసులు నమోదయ్యాయి. తాజాగా, మంగళవారం ఒక్కరోజే 14 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 28కు చేరింది. పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడం మెదక్ జిల్లా ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది.