సారథి న్యూస్, మహబూబ్ నగర్ : మహిళా స్వయం సహాయక సంఘాలకు కోవిడ్-19 అత్యవసర తత్కాల్ రుణ సహాయం అందించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు ఆయా బ్యాంకుల మేనేజర్లను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ లోని రెవెన్యూ సమావేశ మందిరంలో బ్యాంకుల మేనేజర్లు, వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కరోనా కారణంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా మారిందని, స్వయం సహాయక సంఘాల సభ్యులు ఇబ్బంది పడకుండా నేరుగా బ్యాంకుల ద్వారా ప్రతి సంఘానికి రూ.లక్ష లేదా ప్రతి సభ్యురాలికి రూ.ఐదువేలకు తగ్గకుండా రుణాలు ఇవ్వాలని కోరారు.
సమాజంలో ఉన్న హిజ్రాలను గుర్తించి వారికి కూడా రుణాలు ఇవ్వాలన్నారు. అన్ని బ్యాంకుల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుదారులకు మంజూరు చేసిన రూ.1500 తీసుకునేందుకు, అలాగే వ్యవసాయ రుణాలకు రైతులు పెద్దసంఖ్యలో బ్యాంకులకు వస్తారని, సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
చేతులు శుభ్రంగా కడుక్కునేందుకు సబ్బు, నీరు, శానిటైజర్ లను అన్ని బ్యాంకుల వద్ద ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి బ్యాంకు ముందు టెంట్ తో పాటు తాగునీరు ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. సమావేశంరో అదనపు కలెక్టర్ మోహన్ లాల్ , ఎల్ డీఎం నాగరాజు, డీఏవో సుచరిత, డీఆర్డీవో వెంకట్ రెడ్డి, బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు.