ఏ పార్టీలో ఉన్నా ఆమె ఫైర్‌బ్రాండే.. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ రచ్చరచ్చే. అది మీటింగ్ కానీ, అసెంబ్లీ కానీ. ఒకప్పుడు ఆమెను ఐరన్‌లెగ్‌గా అభివర్ణించినా.. దానికి చెక్ పెడుతూ ఇక ఆమెకు అంతా విజయమే అనుకున్నారు చాలామంది. కానీ, విజయం అంచులదాకా వచ్చి దూరమవుతోంది.. అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇదంతా ఎవరి గురించో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆమే ఏపీ రాష్ట్రంలోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా. ఆమె సినీజీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగారు. అనంతరం రాజకీయాలపై మక్కువతో ఆమె టీడీపీలో అడుగుపెట్టారు. కానీ, ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసినా ఆమె విజయం సాధించలేదు. అప్పట్లో చంద్రబాబు మీద ఈగ వాలనిచ్చేవారు కారు. కానీ, పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఆమె టీడీపీని వీడి జగన్ పార్టీలోకి జంప్ అయ్యారు. మళ్లీ వైఎస్సార్సీపీ నుంచి నగరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. కానీ, ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయింది. దీంతో ఆమె మంత్రి అవుదామనుకున్న కల నెరవేరకుండా పోయింది. ప్రతిపక్షంలో కూర్చున్నా చంద్రబాబు ప్రభుత్వంపై అసెంబ్లీలో, బయటా ఒంటికాలుపై లేచేవారు. చివరకు అసెంబ్లీని అవహేళన చేశారని ఆమెపై దీర్ఘకాలం సస్పెన్షన్ విధించింది చంద్రబాబు ప్రభుత్వం. తిరిగి ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు ఆ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. దీంతో, ఇక తన కల నేరవేరబోతోందని సంతోషించారు. కానీ, మంత్రివర్గంలో ఆమెకు చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆమె అలకబూనినట్టు వార్తలు వచ్చాయి. తర్వాత జరిగిన పరిణామాల్లో ఆమెకు ఏపీఐఐసీ పదవి దక్కింది, కానీ, ఆమె కల మాత్రం మంత్రిగా పనిచేయడమే.
మళ్లీ తెరపైకి..
ఆమె కల ఇప్పుడైనా నెరవేరుతుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం మంత్రులుగా పనిచేస్తున్న మోపిదేవి, పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో వీరు రాష్ట్ర మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ రెండు మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయన్నది జోరుగా చర్చ సాగుతోంది. ఈ రెండు పదవులకు ప్రధానంగా అంబటి రాంబాబు, జోగి రమేష్, పొన్నాడ సతీష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అంటే ఈ పరిశీలనలో రోజా పేరు లేదు. అయినా ఆమె మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నారని ఆ పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. ఆమె ఎంత ప్రయత్నించినా ఆమెకు మంత్రి పదవి దక్కకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఆమెకు దూకుడుతునం ఎంత పేరు తెచ్చిపెట్టిందో.. మంత్రి పదవికి కూడా అంతే అడ్డంకిగా మారిందని, ఆమె దూకుడుతనం నచ్చకనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమెను పక్కన పెడుతున్నారని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పేర్కొంటున్నారు.