Breaking News

‘మర్డర్’​కు బ్రేక్​.. వర్మకు షాక్​

సంచలన దర్శకుడు రాంగోపాల్​ వర్మకు నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు షాక్​ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్​ హత్యను ఇతివృత్తంగా తీసుకొని రాంగోపాల్​వర్మ.. మర్డర్​ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ‘మర్డర్’​ సినిమా తన కుమారుడి హత్యకేసు విచారణను ప్రభావితం చేస్తుందని.. అందువల్ల సినిమా విడుదలను నిలిపివేయాలని ప్రణయ్​ తండ్రి కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్డు ఈ విచారణ పూర్తయ్యేవరకు ‘మర్డర్’ సినిమాను విడుదల చేయొద్దని సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ చిత్రం విచారణపై ​ప్రభావం చూపే అవకాశం ఉన్నదని కోర్టు అభిప్రాయపడింది. న‌ల్ల‌గొండ జిల్లా మిర్యాల‌గూడ‌లో రెండేళ్ల క్రితం పెరుమాళ్ల ప్ర‌ణ‌య్ అనే యువ‌కుడు హ‌త్య‌కు గురయ్యాడు. ఇది ప‌రువు హ‌త్య‌. అప్ప‌ట్లో ఈ హ‌త్య తీవ్ర సంచ‌ల‌నం క‌లిగించింది. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడైన అమృత తండ్రి మారుతీరావు కూడా ఇటీవ‌ల ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ద‌ళిత యువ‌కుడైన ప్ర‌ణ‌య్ హ‌త్యను క‌థా వ‌స్తువు చేసుకుని వ‌ర్మ ‘మర్డర్’ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. కోర్టు తీర్పుపై ఆర్జీవీ ఇంకా స్పందించలేదు.