- సీఎస్, డీజీపీతో ప్రత్యేకంగా చర్చించిన ముఖ్యమంత్రి
- జీహెచ్ఎంసీ పరిస్థితిపై అప్రమత్తం చేసిన మంత్రి కేటీఆర్
సారథి న్యూస్, హైదరాబాద్: రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు తెలంగాణ తడిసి ముద్దయింది. ఈ నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వం బుధ, గురువారాల్లో సెలవులు ప్రకటించింది. అత్యవసరమైతేనే ప్రజలు బయటికి రావాలని సూచించింది. పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పాత భవనాలను తక్షణమే ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, పోలీస్‌శాఖను అప్రమత్తం చేసింది. వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు హుటాహుటిన రంగంలోకి దిగారు. అర్ధరాత్రి వరకు వర్షాల పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను అప్రమత్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని అన్నివిధాలా సన్నద్ధంచేసి తక్షణం సహాయచర్యలు చేపట్టాలని ఆదేశించారు. డీజీపీ ఎం మహేందర్‌రెడ్డితోనూ మాట్లాడారు. ముంపు, లోతట్టు ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు.
సీఎం ఆదేశానుసారం డీజీపీ.. అన్ని జిల్లాల ఎస్పీలతో మాట్లాడారు. ముంపు ప్రాంతాల ప్రజలకు సహాయ కార్యక్రమాలపై తక్షణ చర్యలకు ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షితస్థానాలకు తరలించాలని నిర్దేశించారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై విద్యుత్ సంస్థల సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారకరామారావు అన్ని మున్సిపాలిటీల చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లతో ఫోన్‌లో మాట్లాడారు. పట్టణాలు, నగరాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయచర్యలు చేపట్టాలని, సమాంతరంగా పునర్నిర్మాణ కార్యక్రమాలను కొనసాగించాలని ఆదేశించారు.