- ముగిసిన జీహెచ్ఎంసీ పోలింగ్
- కొన్నిచోట్ల రీపోలింగ్.. 4న ఓట్ల కౌంటింగ్
సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల వార్ ప్రశాంతంగా ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీలు నువ్వా..నేనా? అనే రీతిలో తలపడిన పోరులో విజయం ఎవరిని వరించనుందో ఈనెల 4వ తేదీన కౌంటింగ్‌లో తేలనుంది. వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, పలుచోట్ల ఘర్షణలతో అసెంబ్లీ ఎన్నికలను తలపించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 వార్డుల్లో 1,122 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. టీఆర్ఎస్ నుంచి 150 మంది, బీజేపీ నుంచి 149 మంది, కాంగ్రెస్ నుంచి 146 మంది, టీడీపీ నుంచి 106 మంది, ఎంఐఎం నుంచి 51 మంది, సీపీఐ నుంచి 17 మంది, సీపీఎం నుంచి 12 మంది, స్వతంత్రులు 415 మంది, ఇతరులు 76 మంది వివిధ స్థానాల నుంచి పోటీచేశారు. మొత్తంగా 45.71 శాతం పోలింగ్ నమోదైనట్లు మంగళవారం రాత్రి ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 48వేల మంది పోలింగ్ సిబ్బంది, 52,500 మంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించారు. కాగా, కొన్ని డివిజన్లలో కనీసం 25 శాతం కూడా పోలింగ్ నమోదు కాలేదని స్పష్టమవుతోంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.29శాతం పోలింగ్ నమోదైంది. కాగా, ఓల్డ్ మలక్‌పేట డివిజన్ 26లో సీపీఐ అభ్యర్థి గుర్తు కంకి కొడవలిని బ్యాలెట్ పేపర్‌పై ముద్రించాల్సి ఉండగా, పొరపాటున సీపీఎం గుర్తు సుత్తి కొడవలి, నక్షత్రం గుర్తును ముద్రించారు. సీపీఐ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ డివిజన్లో పోలింగ్‌ను నిలిపివేసి 3న రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్నిర్ణయించింది.