Breaking News

బీజేపీ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో చెప్పాలి

బీజేపీ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో చెప్పాలి

  • రైతులపై ప్రేమ ఉంటే దేశవ్యాప్తంగా ఉచిత కరెంట్​ ఇవ్వాలి
  • ఈనెల 28 నుంచి యాసంగి పంట పెట్టుబడి సాయం
  • ఖాళీ జాగాలో ఇల్లు కట్టుకుంటే ఆర్థిక సాయం
  • తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్​రావు

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: పేదల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్​రావు అన్నారు. రైతులకు బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. పక్కనే ఉన్న కర్ణాటకలో రైతులకు పంట పెట్టుబడి కోసం ఎలాంటి పథకాలు అమలు చేయలేదని, ఆర్థిక సాయం అందించలేదని విమర్శించారు. బుధవారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేట పట్టణం తిర్మలాపూర్​ శివారులో 100 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. రైతులపై కేంద్ర ప్రభుత్వానికి నిజంగా ప్రేమ ఉంటే దేశం మొత్తం 24 గంటల పాటు ఉచిత విద్యుత్​సరఫరా చేయాలని డిమాండ్​ చేశారు. తెలంగాణలో మాత్రం బీజేపీ నాయకులు ఎగిరెగిరి పడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి హరీశ్​రావు

28 నుంచి రైతులకు పంట పెట్టుబడి సొమ్ము
ఈనెల 28 నుంచి యాసంగి పంట పెట్టుబడి కోసం భూమి ఉన్న ప్రతి రైతుకు ఎకరాకు రూ.ఐదువేలను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర లేకుండా చేయాలని చూస్తోందన్నారు. రైతులు పండించిన పంటను సోలాపూర్, అకోలా, నాగపూర్ లో అమ్ముకోవాల్సిన పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల తర్వాత మార్చి నెల నుంచి ఖాళీస్థలంలో ఎవరైనా ఇండ్లు కట్టుకుంటే వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తామన్నారు.
కరోనాతో రూ.40వేల కోట్ల ఆదాయానికి గండి
కరోనా ప్రభావంతో ప్రభుత్వానికి రూ.40వేల కోట్ల ఆదాయం తగ్గిందన్నారు. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎక్కడా సంక్షేమ పథకాలను ఆపలేదని గుర్తుచేశారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజలకు 10 కేజీల బియ్యం.. రూ.1500 నగదు, కందిపప్పును ఉచితంగా అందజేశామని గుర్తుచేశారు.
పెద్దశంకరంపేటకు కాళేశ్వరం జలాలు
రాబోయే రోజుల్లో పెద్దశంకరంపేట మండలానికి కాళేశ్వరం గోదావరి జలాలను తీసుకొచ్చి ఈ ప్రాంత భూములను సస్యశ్యామలం చేస్తామన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ కాల్వల ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అందిస్తామన్నారు. మెట్లకుంట- రేగోడ్ బీటీ రోడ్డు వయా కట్టల వెంకటాపురం, గొట్టుముక్కల, తిమ్మాపూర్, కొండాపూర్ గ్రామాల మీదుగా 12 కి.మీ. రోడ్డు నిర్మాణానికి రూ.6.33 కోట్లు మంజూరు చేశామని వివరించారు. ఈ రహదారి సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు అనుసంధానంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు, సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, టీఆర్​ఎస్​ మండలాధ్యక్షుడు మురళి పంతులు, సంగారెడ్డి జిల్లా రైతుబంధు అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ రామచంద్రారెడ్డి, డి.శ్రీనివాస్, సర్పంచ్​ల ఫోరం మండలాధ్యక్షుడు కుంట్ల రాములు, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్​లు పాల్గొన్నారు.