Breaking News

బీజేపీపై ఇక యుద్ధమే..

బీజేపీపై ఇక యుద్ధమే..

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలోని 110డివిజన్లలో గెలుపు తమదేనని టీఆర్​ఎస్​ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్​రావు ధీమా వ్యక్తంచేశారు. జీహెచ్ఎంసీ సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని స్పష్టంచేశారు. బీజేపీ వ్యతిరేక పోరాటం హైదరాబాద్ నుంచి మొదలు పెట్టబోతున్నామని పేర్కొన్నారు. దేశంలో బీజేపీ దుర్మార్గం గా వ్యవహరిస్తోందన్నారు. టీఆర్ఎస్ లోకసభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి, జీహెచ్ఎంసీ డివిజన్ ఇన్​చార్జ్​ సంయుక్త సమావేశం ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం తెలంగాణ భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ రెండో వారంలో బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలతో హైదరాబాద్ లో సమావేశం నిర్వహిస్తామన్నారు. మమతాబెనర్జీ, కుమారస్వామి, అఖిలేష్ యాదవ్, స్టాలిన్ తో పాటు మరికొందరు బీజేపీ వ్యతిరేకించే పార్టీల నేతలంతా హాజరవుతున్నారని తెలిపారు. గురువారం జీహెచ్ఎంసీ మొదటి జాబితా విడుదల చేస్తామన్నారు. ఎవరికి ఇచ్చిన డివిజన్ లో వారు గట్టిగా పనిచేయండని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ విమర్శలను తిప్పికొట్టాలని కోరారు. మనం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్రచార అస్ర్తాలుగా వాడుకోవాని కోరారు. కాంగ్రెస్ ను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
వెంకన్న.. కండువా వద్దన్నా
ఇటీవల మరణించిన మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డికి మృతికి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సమావేశంలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత, గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బోగారపు దయానంద్ గుప్తాను పరిచయం చేశారు. ఎమ్మెల్సీ గోరెటి వెంకన్నను సీఎం కేసీఆర్​ ప్రశంసించారు. వెంకన్న పార్టీ కండువా కప్పుకోవాల్సిన అవసరం లేదని, కళాకారుడిగా తన గౌరవం తనకు ఉంటుందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డివిజన్ ఇన్​చార్జ్​ల పేర్లను సీఎం కేసీఆర్ ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను రెండు విడతలుగా ప్రకటిస్తామని, మొదటి విడత బుధవారం సాయంత్రం, రెండో విడత గురువారం ప్రకటిస్తామని వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరంలో రూ.67వేల కోట్ల రూపాయలతో జరిగిన అభివృద్ది కార్యక్రమాల జాబితాను తయారుచేసి, వాటిని డివిజన్ల వారీగా ఇన్​చార్జ్​లకు అప్పగించారు. డివిజన్ల వారీగా ఓటరు లిస్టులను, టీఆర్ఎస్ కార్యకర్తల జాబితాను కూడా ఇన్​చార్జ్​లకు అందజేశారు.
నాయిని నైతికత ఉన్న వ్యక్తి
తెలంగాణ కోసం రాజీలేని పోరాటం చేసిన వ్యక్తిగా, రాజకీయాల్లో నైతికత గల వ్యక్తిగా నాయిని నర్సింహరెడ్డి నిలుస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ‘నాయని తెలంగాణ ఉద్యమంలో నిబద్ధత కలిగిన కార్యకర్తగా పనిచేశారు. 1969 ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి నా వెంట నడిచారు. సంక్షిష్ట సమయాల్లో అండగా నిలిచారు. తెలంగాణ కోసం ఆమరణ దీక్షకు దిగినప్పుడు నా వెంటనే ఉన్నారు. నాతోపాటు ఖమ్మం జైలులో గడిపారు. నాకు రక్షణగా నిలిచారు. నైతికత కలిగిన వ్యక్తి. ఎవరికీ భయపడేవారు కాదు. వైఎస్ ఎంత ఒత్తిడి పెట్టినా తలొగ్గకుండా తెలంగాణ కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అమెరికాలో ఉన్నప్పటికీ అప్పుడు తన స్వదస్తూరితో రాజీనామా లేఖ రాసి పంపించారు. అలాంటి గొప్ప వ్యక్తి మరణించడం చాలా బాధాకరం. దురదృష్టకరం. ఆయన మరణాన్ని తట్టుకోలేక ఆయన భార్య కూడా మరణించడం మరింత దుఃఖదాయకం’ అని సీఎం కేసీఆర్​ అన్నారు.
వర్షంలో వారి కష్టం చూసి చలించిపోయా..
‘ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న హైదరాబాద్ కోసం, ఇబ్బంది పడిన ప్రజల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. కానీ బురద రాజకీయం చేస్తున్నది. వరదల్లో చాలా ఇండ్లు మునిగిపోయాయి. ఆహార పదార్థాలు, దుస్తులు, దుప్పట్లు తడిచిపోయాయి. పేదవాళ్లే ఎక్కువ నష్టపోయారు. వారి కష్టం చూసి నేనే చలించిపోయా. మంత్రులు కేటీఆర్, తలసాని, మహమూద్ అలీ తదితరులు బాధితుల ఇండ్లకు వెళ్లి పరామర్శించారు. దసరా, దీపావళి పండుగల ముందు వచ్చిన విపత్తు ఇది. పండుగ పూట పేదలు పస్తులుండవద్దనే ఉద్దేశంతో ఎవరూ అడగకుండానే ఇంటికి రూ.10వేల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించుకున్నం. రూ.550 కోట్లు విడుదల చేశాం. రూ.50కోట్లతో సహాయ, పునరావాస కార్యక్రమాలు, రూ.500కోట్లతో ఆర్థిక సహాయం అందుతున్నది. ఇప్పుడు మీ సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించి, సహాయం అందిస్తున్నం. ఇప్పటికే 6.78 లక్షల మందికి సాయం అందింది. ఇంకా ఎంత మంది బాధితులు ఉంటే అంతమందికి అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంత చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని, ప్రజలను ఆదుకోవడానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. సహాయం చేయకపోగా, ఇచ్చే సహాయాన్ని అడ్డుకుంటోంది. నగరంలో పేదలకు ఆర్థిక సాయం నిలిపి వేయాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేసింది. పేదల నోటి కాడి బుక్క లాక్కుంటున్నది. చిల్లర రాజకీయాలు చేస్తున్నది. ఇది నగర ప్రజలు గమనించాలి’ అని సీఎం కేసీఆర్ కోరారు.
బీజేపీది ఇంత దుర్మార్గమా?
‘దుబ్బాక ఎన్నికల్లో బిజెపి చేయని దుష్ప్రచారం, ఆడని అబద్ధం లేదు. టీఆర్ఎస్ అభ్యర్థి పోలింగ్ బూతులోకి వెళ్లి, బ్యాలెట్ పేపర్ మీద హరీశ్ రావు ఫోటోలేదని అడిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆమెను ఆగౌరవ పరుస్తూ పోస్టింగులు పెట్టారు. ఇంత దుర్మార్గం ఉంటదా? ఇంత నీచమైన ప్రచారం చేస్తరా? ఇంతకు మించిన ఘోరమైన పాపం ఉంటదా? జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇలాంటి దారుణాలే చేయాలని చూస్తరు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. టీఆర్ఎస్ శ్రేణులు ఇలాంటి దుర్మార్గపు ప్రయత్నాలను తిప్పికొట్టాలి’ అని సీఎం కోరారు.