ఎస్పీ బాలు భౌతికకాయాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన నివాసం నుంచి తామరైపాక్కంలోని వ్యవసాయక్షేత్రానికి తీసుకెళ్లారు. శనివారం ఉదయం 10.30 గంటల సమయంలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనుంది. అయితే బాలూను కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, సినీప్రియులు, తమిళనాడులో ఉంటున్న తెలుగుప్రజలు భారీగా తరలివచ్చారు. ఓ దశలో ఆయన ఇంటికి వెళ్లే దారుల్లో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే అభిమానుల సందర్శనార్థం ఆయన మృతదేహాన్ని ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లనున్నారు. మరోవైపు బాలు మృతికి తెలుగు ప్రజలంతా తీవ్ర బాధతప్త హృదయంతో నివాళి అర్పిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయనకు లక్షలమంది అభిమానులు అశ్రునివాళి అర్పిస్తున్నారు.