సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలోని బార్లు, క్లబ్బుల యజమానులకు ఊరట లభించింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా బార్లు, కబ్బులను మూసివేయాలని ప్రభుత్వం ఆరు నెలల క్రితం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ఇప్పటికే వైన్ షాపులు తెరుచుకోగా, మొత్తానికి దాదాపు ఆరు నెలల కాలం తర్వాత తెలంగాణలో బార్లు, క్లబ్బులు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్మిట్ రూమ్‌లకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. బార్లు, క్లబ్బులలో మ్యూజికల్ ఈవెంట్స్, డ్యాన్స్‌లను నిషేధించారు. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలు పాటించని బార్లు, క్లబ్బులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
పాటించాల్సిన నిబంధనలు
- బార్లు, క్లబ్బుల వద్ద థర్మల్ స్ర్కీనింగ్‌లు ఏర్పాటు చేయాలి.
- క్రమపద్ధతి పాటించాలి, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
- పార్కింగ్ ఏరియాల్లో జనాలు గుమిగూడకుండా చూడాలి
- శానిటైజర్ తప్పనిసరిగా ఉంచాలి.
- బార్లు, క్లబ్బుల సిబ్బందితో పాటు మిగతా వారు కచ్చితంగా మాస్కు ధరించాలి.
- మ్యూజికల్ ఈవెంట్స్, డ్యాన్స్‌లపై నిషేధం.
- ప్రతి రోజు ఉదయం, సాయంత్రంతో పాటు ఒక వ్యక్తి మద్యం సేవించి వెళ్లిన తర్వాత ఆ సీటును శానిటైజ్ చేయాలి.
- వెంటిలేషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలి.