![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/KADALI-NANIIIIFF.jpg?fit=700%2C431&ssl=1)
విజయవాడ: పది మందికి చావుకు కారకుడైన రమేశ్ ఆస్పత్రి యజమాని, పోతినేని రమేశ్‌బాబు ఏ బొక్కలో దాక్కున్నా ఏపీ పోలీసులు వదిలిపెట్టరని.. ఆయనను అరెస్ట్ చేసి తీరుతారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో దాక్కొని కుట్రలు పన్నుతున్నారని.. దమ్ముంటే ఆంధ్రప్రదేశ్‌కు రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబు, పచ్చమీడియా కుట్రలను తిప్పికొడతామన్నారు. పరిహారం విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి .. అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో రూ.50 లక్షలు, ఎల్జీ పాలీమర్స్ ఘటనలో రూ.కోటి చొప్పున సీఎం జగన్ పరిహారం ఇచ్చారని గుర్తుచేశారు. చంద్రబాబు కమ్మసంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
తన సామాజికవర్గానికి చెందిన నేరస్థులను ఆయన కాపాడుతున్నారని ఆరోపించారు. ‘రమేష్ ఆస్పత్రి నిబంధనలు ఉల్లంఘించింది. రమేష్‌ను రక్షించేందుకు పచ్చమీడియా తీవ్రంగా ప్రయత్నం జరుగుతుంది. చంద్రబాబు తన ఇంట్లోనే డాక్టర్ రమేష్‌ను పెట్టుకుని కాపలా కాస్తున్నారు. చంద్రబాబు కాపలా కాసినా రమేష్‌ను అరెస్ట్ చేస్తాం. బాధితుల పరామర్శకు వస్తే కరోనా వస్తుందని హైదరాబాద్‌లో దాక్కున్నారు. తనకు కూడా ఎక్స్‌గ్రేషియా వస్తుందని బాబు భయపడుతున్నారు’ అని కొడాలి నాని ఎద్దేవా చేశారు. కమ్మ సామాజికవర్గం వారిని టార్గెట్ చేయాల్సిన అవసరం సీఎం జగన్మోహన్రెడ్డికి లేదని స్పష్టం చేశారు.