Breaking News

ప్రతిపక్షాల విమర్శలు అర్థరహితం

ప్రతిపక్షాల విమర్శలు అర్థరహితం

  • వైద్యసిబ్బందిలో ఆత్మవిశ్వాసం దెబ్బతీయొద్దు
  • కరోనాకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం
  • మహబూబ్​నగర్ ​మెడికల్ ​కాలేజీ ప్రారంభోత్సవంలో మంత్రి కె.తారకరామారావు

సారథి న్యూస్, మహబూబ్​నగర్: కరోనాకు పేద, ధనిక అనే తేడాలు ఉండవని, ఎవరికైనా రావచ్చని మున్సిపల్​శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. కరోనాపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. నిర్మాణాత్మక సూచనలు చేస్తే స్వీకరిస్తామని హితవుపలికారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ ​కాలేజీని మంత్రులు ఈటల రాజేందర్, కె.తారక రామారావు, వి.శ్రీనివాస్ గౌడ్‌ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ కరోనాపై ప్రతిపక్ష పార్టీ నేతల తీరును విమర్శించారు. అనవసర విమర్శలు చేసి వైద్య సిబ్బందిలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయొద్దని హితవు పలికారు. కరోనా కేసుల్లో భారత్ ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉందని, మరి ఇది ప్రధాని మోడీ వైఫల్యంగా భావించాలా? అని ప్రశ్నించారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే అన్ని పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. భారత్‌లో తయారైన మందులు ప్రపంచానికి ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఫార్మా పరిశ్రమ పట్ల ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించొద్దని సూచించారు. సమాజంలో కరోనా బాధితులను వెలివేసినట్లు చూడడం సరికాదన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి

తాము ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రైవేట్​ఆస్పత్రులు పడకలు లేవని తిప్పి పంపుతున్నాయని, కానీ, ప్రభుత్వ ఆస్పత్రులు మాత్రం రోగి ఏ స్థితిలో ఉన్నప్పటికీ వారిని చేర్చుకుని వైద్యం అందిస్తున్నాయని ప్రశంసించారు. కరోనా అనేది మానవాళి మొత్తం ఎదుర్కొంటున్న విపత్తు అనిని, అందరం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మహబూబ్​నగర్ సమీపంలో ఏనుగొండ బైపాస్ రోడ్ లో హరితహారంలో భాగంగా 10వేల మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. మొక్కలు నాటి ప్రారంభించారు. రూ.155.60 లక్షలు నిధులతో చేపట్టనున్న కేసీఆర్​ ఏకో పార్కు పనులను ప్రారంభించారు. మహబూబ్​నగర్ అభివృద్ధి పనులపై రూపొందించిన ప్రగతి పథం ప్రత్యేక పుస్తకాన్ని మంత్రులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో మహబూబ్​నగర్​ జడ్పీ చైర్​పర్సన్​ స్వర్ణసుధాకర్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ మన్నెం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్​వెంకట్రావు, ఎస్పీ రెమా రాజేశ్వరి, మున్సిపల్​ కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.