Breaking News

పునరావాస సహాయక చర్యలు ఆపొద్దు

పునరావాస సహాయక చర్యలు ఆపొద్దు

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో సహాయ పునరావాస కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నగరంలో జరుగుతున్న సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ‘భారీ వర్షాలు, వరదల వల్ల ఇండ్లలోకి నీరొచ్చి ఆహార పదార్ధాలు, దుస్తులు, చెద్దర్లు అన్నీ తడిసిపోయాయి. కనీసం వండుకుని తినే పరిస్థితుల్లో కూడా చాలా కుటుంబాలు లేవు. అందుకే వారికి తక్షణ సాయంగా ప్రతి బాధిత కుటుంబానికి రూ.10వేల చొప్పున సాయం అందించాలని నిర్ణయించాం. రోజుకు కనీసం లక్ష మందికి ఆర్థిక సాయం అందించేలా పనిచేయాలి’ అని సూచించారు.
ట్రాన్స్ ఫార్మర్లను పునరుద్ధరించాం
‘భారీ వర్షాలు, వరదల వల్ల 15 చోట్ల 33/11 కేవీ విద్యుత్​సబ్ స్టేషన్లు దెబ్బతినగా, అన్నింటికి మరమ్మతు చేసి, పునరుద్ధరించాం. 1,080 చోట్ల 11 కేవీ ఫీడర్లలో దెబ్బతినగా అన్నింటినీ మరమ్మతు చేశాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1215 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతినగా, 1,207 ట్రాన్స్ ఫార్మర్లు మరమ్మతు చేసి పునరుద్ధరించారు. మిగతా 8 ట్రాన్స్ ఫార్మర్లు నీటిలో మునగడంతో మరమ్మతు చేయలేకపోయాం. మూసీ వరదలతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి చెందిన 1145 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతినగా, 386 మరమ్మతు చేశారు. మరో 759 మిగిలి ఉన్నవి. వీటిలో 586 ట్రాన్స్ ఫార్మర్లు నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట ప్రాంతాల్లో మూసీ నదిలో మునిగిపోయాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,299 స్తంభాలు దెబ్బతినగా మరమ్మతు చేశాం. మూసీ వరదలతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి చెందిన 5,335 స్తంభాలు దెబ్బతినగా, 3,249 మరమ్మతు చేశారు. మిగతా 2,086 స్తంభాల మరమ్మతు పనులు జరుగుతున్నాయి’ అని ఎస్పీడీసీఎల్​సీఎండీ రఘుమారెడ్డి వివరించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్​ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, ఎంఏయూడీ కమిషనర్ సత్యానారాయణ రెడ్డి, వాటర్ వర్క్స్ ఈడీ సత్యనారాయణ పాల్గొన్నారు.