సారథి న్యూస్, హైదరాబాద్: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో ఆదివారం రాత్రి ప్రారంభమైన వాన ఆగుతూ.. ఆగుతూ పడుతూనే ఉంది. ఇప్పటికే రాజధాని నగరం హైదరాబాద్.. భారీ వర్షానికి జలమయమైంది. నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరింది. ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా జీహెచ్ఎంసీ అధికారులు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా వేంసూర్‌లో అత్యధికంగా 18.7 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. నాగర్‌కర్నూల్, నల్లగొండ, వనపర్తి, మెదక్, సిద్దిపేట, కుమ్రంభీం జిల్లాల్లో భారీ వర్షమే కురిసింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ ముసురు వర్షం కురుస్తుండడంతో చేతికొచ్చిన సోయా, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందోరాదోనని రైతులు దిగులు చెందుతున్నారు.
నిండుకుండలా ప్రాజెక్టులు
భారీ వర్షాలకు జూరాలకు వరద పెరగడంతో 20 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 1.65 లక్షల క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 1.61 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు కాగా, ప్రస్తుతం 317.92 మీటర్లు నీరు ఉంది. అలాగే నిజామాబాద్ లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద పెరిగింది. ఇన్‌ఫ్లో 61,443 క్యూసెక్కులు ఉంది. 16 గేట్లు ఎత్తి 50వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే కరీంనగర్ జిల్లా లోయర్‌మానేర్ డ్యామ్‌కు వరద పోటెత్తింది. 12 గేట్లు ఎత్తి 24వేల క్యూసెక్కుల నీటిని దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 24,276 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 24,276 క్యూసెక్కులుగా ఉంది. రాజన్నసిరిసిల్ల జిల్లా మిడ్‌మానేరుకు వరద ఉధృతి కొనసాగుతోంది. నాలుగు గేట్లు ఎత్తి 9,644 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 5,845 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 9,711 క్యూసెక్కులు ఉంది.
వాగులు, వంకల నుంచి దాటొద్దు
సారథి న్యూస్, హుస్నాబాద్: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని హుస్నాబాద్ ఏసీపీ సందెపోగు మహేందర్ తెలిపారు. మంగళవారం పలు వాగుల్లో ప్రవహిస్తున్న నీటి ఉధృతిని పరిశీలించి మాట్లాడారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని కోహెడ మండలం బస్వాపూర్ సమీపంలో మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వరంగల్ నుంచి సిద్దిపేట జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి రాకపోకలను పూర్తిగా నిలిచిపోయాయన్నారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు, పొట్లపల్లి రేణుకా ఎల్లమ్మవాగు, గుగ్గిళ్ల, తంగళ్లపల్లి గ్రామ సమీపంలో ప్రవహించే పిల్లివాగు బ్రిడ్జిపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, ప్రజలు రాత్రివేళల్లో ప్రయాణాలు చేయడం సురక్షితం కాదన్నారు. రైతులు వ్యవసాయ బావుల్లోని మోటార్లు పూర్తిగా నీట మునిగి వాటి సమీపంలోని స్టార్టర్లు వర్షానికి నడవడం ద్వారా ఎర్త్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నీటి పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీస్ ఉన్నతాధికారులతో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడమే కాకుండా స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట హుస్నాబాద్ సీఐ రఘు, ఎస్సైలు శ్రీధర్, రాజకుమార్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.