Breaking News

‘పల్లె’వించిన జీవనం

  • తిరిగొచ్చిన వలస జీవులు
  • గ్రామాల్లో జనకళ

సారథి న్యూస్‌, విజయనగరం: ఉద్యోగం, ఉపాధి కోసం వలస పోయిన జనం.. తాళాలతో దర్శనమిచ్చే ఇళ్లు.. పడిపోయిన పూరిగుడిసెలు.. కన్న బిడ్డల కోసం ఎదురుచూసూ వృద్ధులు… ఇదీ నిన్నటిదాకా పల్లెల ముఖచిత్రం. కరోనా కల్లోలం ఇప్పుడు పల్లెల ముఖచిత్రాన్ని మార్చేసింది. ఉపాధి కోసం ఊళ్లు వదిలి వెళ్లిపోయినోళ్లు సొంతూరు బాటపట్టారు. బతికి ఉంటే బలుసాకైనా తిని ఉండొచ్చనే ఉద్దేశంతో వలసజీవులు అష్టకష్టాలు పడి సొంతూళ్లకు వచ్చేవారు. ఉన్న ఉపాధి కోల్పోయి స్వగ్రామాలకు రావడంతో ఇళ్లు ఎలా గడపాలని ఆలోచనలో పడ్డారు వలసజీవులు.

జనం రాకతో గ్రామాలు కళకళలాడుతున్నాయి. దీంతో ఉపాధి పనులకు గిరాకీ పెరిగింది. గ్రామాల్లోకి వచ్చిన వారు తమ ఆధార్‌ కార్డులు ఆధారంగా జాబ్‌కార్డులు ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే జాబ్‌కార్డులున్న వారు పనులకు వెళ్తుంటే.. లేనివారు కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్‌ నుంచి 35వేల కొత్త జాబ్‌కార్డులు ఇచ్చినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కాగా వీటితో పాటు పాత జాబ్‌కార్డుల్లో తమ కుటుంబ సభ్యుల్ని చేర్చాలని కోరడంతో లాక్‌డౌన్‌ సమయంలో సుమారు 40 వేల మందిని చేర్చినట్లు అధికారులు చెబుతున్నారు.