Breaking News

నా కెరీర్​లో అదే మలుపు

నా కెరీర్​లో అదే మలుపు

న్యూఢిల్లీ: ఐపీఎల్​లో సన్​ రైజర్స్​ హైదరాబాద్​కు ఆడడమే తన కెరీర్​లో పెద్దమలుపు అని టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ అన్నాడు. డెత్ ఓవర్లలో ఒత్తిడిని జయించడం నేర్చుకున్నానని చెప్పాడు. ‘యార్కర్లు సంధించే నైపుణ్యం నాకు ఎప్పుడూ ఉంది. మధ్యలో కాస్త తగ్గినా మళ్లీ నేర్చుకున్నా. సన్​ రైజర్స్​ హైదరాబాద్ కు మారిన తర్వాత ఇన్నింగ్స్ మొదట, చివర బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది. 2014లో ఆ ఫ్రాంచైజీ తరఫున 14 మ్యాచ్​లు ఆడాను. దీంతో స్లాగ్ ఓవర్లలో ఒత్తిడిని ఎలా అధిగమించాలో నేర్చుకునే అవకాశం దక్కింది. అదే నా కెరీర్​కు పెద్దమలుపు’ అని భువనేశ్వర్ పేర్కొన్నాడు.

మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలాగా ఫలితంతో సంబంధం లేకుండా ఆడితే బాగా విజయవంతం కావొచ్చన్నాడు. ఈ విషయం తన కెరీర్​లో రుజువైందని కూడా చెప్పాడు. కరోనా లాక్​ డౌన్​లో జీవితం చాలా కష్టంగా గడిచిందని భువీ వెల్లడించాడు. ‘తొలి 15 రోజులు పెద్దగా ఇబ్బంది కాలేదు. నన్ను నేను ప్రోత్సహించుకున్నా. కానీ రానురాను గడ్డు పరిస్థితులు తలెత్తాయి. బయటకు వెళ్లడానికి వీల్లేదు. కసరత్తులు చేసేందుకు ఇంట్లో సామగ్రి లేదు. ఏం చేయాలో తోచలేదు. లాక్​డౌన్​ ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదు. అందుకే 15 రోజుల తర్వాత ఎక్సర్​ సైజ్​ పరికరాలు తెప్పించుకుని ఇంట్లోనే కసరత్తులు చేశాను. దీని నుంచి కొద్దిగా ఉపశమనం కలిగింది. బౌలింగ్ ప్రాక్టీస్ లేకపోవడంతో.. ఫిట్​నెస్​పై దృష్టిపెట్టా’ అని భువీ వ్యాఖ్యానించాడు. 2013 నుంచి ఐసీసీ ట్రోఫీలు గెలువకపోవడానికి ప్రత్యేకమైన కారణాలేమీ లేవని చెప్పాడు.