- మూడు రోజులుగా తుంగభద్ర నదిలో గాలింపు
- కర్నూలు శివారు.. 8 కి.మీ. దూరంలో డెడ్‌బాడీ
- కన్నీరుమున్నీరుగా విలపించిన కుటుంబసభ్యులు
సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): కలుగొట్ల వద్ద కారు వాగులో కొట్టుకుపోయిన ఘటనలో మహిళ డెడ్ బాడీ మూడు రోజుల అనంతరం సోమవారం మధ్యాహ్నం దొరికింది. ఉండవెల్లి మండలం కలుగొట్ల గ్రామశివారులో శనివారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో కారు బోల్తాపడిన పడిన విషయం తెలిసిందే. కడప జిల్లా పులివెందుల ప్రాంతానికి చెందిన నాగసింధురెడ్డి భర్తతో కలిసి బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. 44వ జాతీయ రహదారిపైకి సమీప మార్గం నుంచి ఈజీగా చేరుకునేందుకు ప్రయత్నించగా కలుగొట్ల వద్ద వాగులో కారు కొట్టుకుపోయింది. అందులో ఉన్న శివకుమార్ రెడ్డి, జిలానీబాషా సేఫ్‌గా బతికిబయటపడ్డారు. కాగా, నాగసింధురెడ్డి తుంగభద్ర నీటిలో కొట్టుకుపోయి సంఘటన స్థలానికి 8 కి.మీ. దూరంలో కర్నూలు పట్టణ శివారులోని నరసింగరావుపేట సమీపంలో మృతదేహం ఎట్టకేలకు లభించింది. ఆమె ఆచూకీ లభించకపోవడంతో కన్నీరు మున్నీరైన కుటుంబసభ్యులు, బంధువులు సోమవారం చేదు వార్త వినాల్సి వచ్చింది. విగతజీవిగా మారిన ఆమెను చూసి గుండెలు బాదుకున్నారు. నాగసింధురెడ్డి ఆచూకీ కోసం ఉండవెల్లి ఎస్సై మధుసూదన్ రెడ్డి, అలంపూర్ సీఐ వెంకటరమణాశెట్టి, పోలీసుల బృందం, గజ ఈతగాళ్లు, కర్నూలు పోలీసులు బృందం తీవ్రంగా శ్రమించారు. ఎట్టకేలకు మృతదేహం లభించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.