సారథి న్యూస్, హైదరాబాద్: బీజేపీకి ఒక్కసారి అవకాశమిస్తే హైదరాబాద్ ను ఐటీ హబ్ గా అభివృద్ధి చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ప్రకటించారు. సిటీలో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చేస్తామన్నారు. ‘నిజాం సంస్కృతిని వదిలి.. నయా హైదరాబాద్ ను నిర్మిద్దాం.. కుటుంబ పాలన నుంచి ప్రజాస్వామ్యం వైపు వెళ్దాం.. అవినీతి నుంచి పారదర్శక పాలన తీసుకొద్దాం.. సంతుష్టీకరణ నుంచి సమష్టి అభివృద్ధి వైపు పయనిద్దాం..’ అని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజు ఆదివారం రోడ్ షో అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఐదేళ్ల క్రితం వంద రోజుల ప్రణాళిక అని ప్రకటించారు.. వందరోజులు కాదు.. ఐదేళ్లు పూర్తయింది.. అవేమైనా అమలయ్యాయా? అని ప్రశ్నించారు. నల్లా కనెక్షన్లు ఇస్తామని ఇవ్వలేదన్నారు. పేదలకు లక్ష ఇళ్లు కట్టిస్తామని కట్టలేదన్నారు. మూసీ తీరాన్ని ఆనుకుని ఆరు లేన్ల రోడ్లు నిర్మిస్తామని నిర్మించలేదన్నారు. 15 డంపింగ్ యార్డులు నిర్మిస్తామన్నారు.. అవేవీ అని ప్రశ్నించారు. హుస్సేన్ సాగర్ ను స్వచ్ఛంగా చేస్తామని చేయలేదన్నారు. గాంధీ, ఉస్మానియా తరహాలో నాలుగు ఆస్పత్రులు కడుతామని కట్టలేదని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలుచేయకపోవడంతో పేద కుటుంబాలు ఐదు లక్షల రూపాయల మేరకు ఉచిత వైద్యం పొందే ప్రయోజనం పొందలేకపోతున్నారని అన్నారు. తెలంగాణ అంటే ఒక్క కుటుంబానిదే కాదన్నారు. తెలంగాణలో లక్షా 30వేల ఇళ్లకు కేంద్రం నిధులిచ్చిందన్నారు. చిరు వ్యాపారులకు కేంద్రం ఇచ్చిన లోన్లు లభించిన వారిలో ఎక్కువ మంది తెలంగాణ వారే ఉన్నారని చెప్పారు.
మాకేం అభ్యంతరం లేదు
మజ్లీస్ తో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే తమకేమి అభ్యంతరం లేదన్నారు. ఎంఐఎం అడుగుజాడల్లోనే టీఆర్ఎస్ నడుస్తోందని, ఎంఐఎం అండతోనే హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు పెరిగిపోయాయని అన్నారు. వరదలు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ప్రజలు వరదల్లో సతమతమైతే సీఎం కేసీఆర్, ఓవైసీ బయటకి అడుగుపెట్టలేదన్నారు. ప్రధాని మోడీ విధానాల వల్లే హైదరాబాద్ కు పలు విదేశీ సంస్థలు వచ్చాయన్నారు. వర్క్ ఫ్రం హోం బదులు వర్క్ ఫ్రం ఎనీవేర్ పథకాన్ని మోడీ తీసుకొచ్చారని గుర్తుచేశారు. దీని వల్ల కూడా హైదరాబాద్ యువతకే ఎక్కువ మేలు జరిగిందన్నారు.
- November 29, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- AMITHSHA
- BJP
- HYDERABAD
- MIM
- NARENDRAMODI
- OWAISI
- TELANGANA
- అమిత్షా
- ఎంఐఎం
- తెలంగాణ
- నయా హైదరాబాద్
- ప్రధాని మోడీ
- బీజేపీ
- Comments Off on నయా హైదరాబాద్ ను నిర్మిద్దాం