Breaking News

దానం ఎక్కడ?

దానం ఎక్కడ?

సారథి న్యూస్, హైదరాబాద్: ఆయన ఒకప్పుడు గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు.. అంతకు మించి ముఖ్యమంత్రిగా డాక్టర్ ​వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో రాష్ట్ర రాజధానిలో హల్‌ చల్‌ చేసిన వ్యక్తి. ఎన్నికలైనా, పార్టీ కార్యక్రమాలైనా హడావుడి, హంగామా చేయడం ఆయనకు రివాజు. అనుకోకుండా, అనివార్యంగా ఈ మాజీ మంత్రి అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కూడా అయ్యారు. కొద్దికాలం వరకూ పరిస్థితి బాగానే ఉంది. కానీ ఉన్నట్టుండి ఏమైందో తెలియదు.. ఇప్పుడు గులాబీ పార్టీతో, అందులోనూ గ్రేటర్‌ హైదరాబాద్‌లోని మంత్రులు, ముఖ్యనేతలతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఆయన ఎవరో కాదు ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌. ఉమ్మడి రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన ఈయన.. గ్రేటర్‌ కాంగ్రెస్‌లో క్రియాశీలక పాత్ర పోషించారు.

అదే దానం.. ఇప్పుడు అధికార పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు వినికిడి. ముఖ్యంగా మంత్రి పదవిని ఆశించే.. ఆయన కాంగ్రెస్‌ను వీడి కారు పార్టీలో చేరుతున్నారంటూ ముందస్తు ఎన్నికలకు ముందు గుసగుసలు వినిపించాయి. కానీ ఎన్నికల తర్వాత తనను పక్కనబెట్టడంతో ఆయన ఒకింత అసంతృప్తికి గురయ్యారు. అయినప్పటికీ అడపాదడపా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. కానీ తలసాని శ్రీనివాస యాదవ్‌కు మంత్రి పదవినివ్వడం, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆయనకు ప్రాధాన్యం పెరిగిపోవడంతో దానం మరింత అసంతృప్తికి గురవుతున్నట్టు సమాచారం. ‘నిత్యం కేడర్‌తో సంబంధాలు నెరుపుతూ, జనంలో ఉండేవాణ్ని… అయినా నాకు ప్రాధాన్యతనివ్వడం లేదు..’ అంటూ ఇటీవల ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం.

ఇటీవల నగరంలోని వీఎస్‌టీ వద్ద నుంచి ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ మీదుగా ఇందిరాపార్కు వరకు నిర్మించతలపెట్టిన ఉక్కు వంతెనకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు, మేయర్‌, ఇతర ప్రజాప్రతినిధులంతా పాల్గొన్నారు. కానీ దానం జాడ మాత్రం కనిపించలేదు. ఇలా కొద్దినెలలుగా ఆయన అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ గులాబీ పెద్దలు నిశితంగా పరిశీలిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుండడం గమనార్హం. గ్రేటర్​పరిధిలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ దానం కనిపించకపోవడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.