- 19న మరో అల్పపీడనం
- అలర్ట్ అయిన ఇరురాష్ట్రాల అధికారులు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న వర్షాలు మరో మూడురోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని వాతావరణశాఖ అంచనావేసింది. ఈశాన్య మధ్యప్రదేశ్, ఉత్తర చత్తీస్ గఢ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 5.8 మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఇది ప్రయాణించి బలహీనపడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో రేపు కూడా వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో 19న అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్పపీడనం బలపడి పశ్చిమదిశగా పయనించే అవకాశం ఉంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. గోదావరి వరదలకు ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లోని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.