- వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేద్దాం
- శతజయంతి ఉత్సవాల నిర్వహణపై సీఎం చంద్రశేఖర్‌రావు
సారథి న్యూస్, హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని కోరుతూ.. సెప్టెంబర్7నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయనున్నట్లు సీఎం కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. నెక్లెస్ రోడ్ కు పీవీ జ్ఞానమార్గ్ గా పేరుపెట్టాలని నిర్ణయించారు. హైదరాబాద్ లో మెమోరియల్ నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు. పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణపై సీఎం శుక్రవారం ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీవీ నరసింహారావు తెలంగాణ అస్తిత్వ ప్రతీక అని, దేశంలో అనేక సంస్కరణలు అమలుచేసిన గొప్ప సంస్కర్త అని కొనియాడారు. దేశ ప్రధానిగా ఎదిగిన తెలంగాణ బిడ్డ గొప్పతనాన్ని అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. అసెంబ్లీలో పీవీ తైలవర్ణ చిత్రం పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. హైదరాబాద్ లో పీవీ నెలకొల్పిన సెంట్రల్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నారు.
పర్యాటక ప్రాంతాలుగా లక్నెపల్లి, వంగర
పీవీ పుట్టిన లక్నెపల్లి, పెరిగిన వంగర గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ది చేయాలని సమావేశంలో నిర్ణయించారు. త్వరలోనే ఆ గ్రామాలను సందర్శించి, పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసే ప్రణాళిక తయారు చేయాల్సిందిగా సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను సీఎం ఆదేశించారు. పీవీ శత జయంతి ఉత్సవాలను అమెరికా, సింగపూర్, సౌతాఫ్రికా, మలేసియా, మారిషస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా తదితర దేశాల్లో కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు.
పీవీ ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు వివిధ దేశాల అధ్యక్షులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటన్ మాజీ అధ్యక్షుడు జాన్ మేజర్, కామెరూన్ తదితరులను కూడా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేలా చేయాలని నిర్ణయించారు. ఆయన రచించిన పుస్తకాలు, ప్రచురించిన పుస్తకాలను సీఎం కేసీఆర్‌కు పీవీ కుమార్తె వాణిదేవి అందజేశారు. మంత్రులు ఈటల రాజేందర్, వి.శ్రీనివాస్‌గౌడ్, పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు, ఎంపీ కె.కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు అనురాగ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.