Breaking News

తమ్మినేని.. ఇదేంది?

కొంతకాలంగా ఏపీ హైకోర్టు తీర్పులపై వైఎస్సార్​సీపీ నేతలు, ఆ పార్టీ సోషల్​ మీడియా విభాగం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ స్పీకర్​ తమ్మినేని సీతారాం కూడా హైకోర్టు తీర్పులను తప్పుపట్టారు. ఈ అంశంపై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం స్పీకర్​ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతయుతమైన రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న ఓ వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నది.

హైకోర్టు తీర్పులపై ఏమన్నా అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని.. అంతేకానీ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికింది. అసలు ఏపీలో ఉన్న పరిస్థితులు దేశంలో ఎక్కడా లేవని వ్యాఖ్యానించింది. న్యాయస్థానాలపై మీడియా, సోషల్‌ మీడియాలో ప్రజాప్రతినిధులు, వైసీపీ సోషల్ మీడియా విభాగం చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ కేసులో సీఐడీ విఫలమైతే సీబీఐకి విచారణ బదిలీ చేయాల్సి ఉంటుందని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది.