Comments Off on జులై నాటికి 25 కోట్ల మందికి వ్యాక్సిన్
న్యూఢిల్లి: ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అవిషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ పలు సంస్థలు వ్యాక్సిన్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే అసలు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది..? వస్తే ముందుగా ఎవరికి ఇవ్వాలనేదానిపై ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో భారత్ లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో.. వ్యాక్సిన్ వస్తే ఎవరికి అందజేయాలని దాని మీద కూడా జోరుగా చర్చ జరుగుతున్నది. ఇదే విషయంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కీలక ప్రకటన చేశారు. ఫేస్‌బుక్‌లో నిర్వహించిన సండే సంవాద్‌లో భాగంగా ఆయన మాట్లాడారు.
దేశంలో వచ్చే ఏడాది జులై వరకు 25 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని హర్షవర్ధన్ తెలిపారు. భారత్‌లో మూడు సంస్థలు ప్రస్తుతం వ్యాక్సిన్ తయారుచేసే పనిలో ఉన్నాయి. అందులో హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్, జైడుస్ కాడిల్లాతో పాటు ఆక్స్‌ఫర్డ్ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్‌తో సంయుక్తంగా తయారుచేస్తున్న ఆస్ట్రాజెనెక వ్యాక్సిన్ లు మూడో దశల (హ్యూమన్ ట్రయల్స్)లో ఉన్నాయి. ఇవన్నీ చేస్తున్న పరీక్షలన్నీ సత్ఫలితాలనే ఇస్తున్నాయని తెలుస్తున్నది.
కాగా 2021 జులై వరకు 40-50 కోట్ల డోసుల వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర అంచనా వేస్తున్నది. ఇదే జరిగితే దాదాపు 25 కోట్ల మందికి దీనిని అందించొచ్చుననే ప్రణాళికలతో ఉంది. అయితే వ్యాక్సిన్‌ను ముందుగా కరోనాకు ఎదురొడ్డి పోరాడుతున్న హెల్త్ వర్కర్స్‌కు అందజేస్తామని హర్షవర్ధన్ తెలిపారు. ఇందుకు సంబంధించి రాష్ట్రాలు తమ దగ్గర ఉన్న వైద్య సిబ్బంది వివరాలు అందజేయాలని ఆయన కోరారు.
గతవారం ఇదే విషయానికి సంబంధించి.. సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో అదర్ పునావాలా ట్విట్టర్ వేదికగా… దేశంలో అందరికీ కరోనా వ్యాక్సిన్ అందజేయాలంటే రూ. 80 వేల కోట్లు అవసరమవుతాయని, అందుకు సంబంధించిన వనరులు మనదగ్గర ఉన్నాయా అంటూ కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.