Breaking News

జీతం కావాలా.. ఆగాల్సిందే!

జీతం కావాలా.. ఆగాల్సిందే!

నాకొచ్చే జీతం ఆధారంగా ఈఎంఐ పెట్టుకుని… హైదరాబాద్‌లో ఓ ఇల్లు కొన్న. ప్రతినెలా 5వ తారీఖున నా బ్యాంకు అకౌంట్‌లోంచి ఈఎమ్‌ఐకి డబ్బులు కట్‌ అవుతాయి. ఆ సమయంలో అకౌంట్‌లో డబ్బుల్లేకపోతే బ్యాంకు వాళ్లు పెనాల్టీ వేస్తారు. చక్రవడ్డీలు, బారువడ్డీలతో బీభత్సంగా డబ్బులు లాగుతారు.
:: ఇది హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన

సారథి న్యూస్, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు.. ఇప్పటి వరకూ వీరి వేతనాలు, జీతాలు, భత్యాలు, ఒకటో తారీఖున ఠంచన్‌గా బ్యాంకు ఖాతాల్లో పడిపోయేవి. కానీ మున్ముందు ఆ పరిస్థితి ఉండకపోవచ్చా..? అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వవర్గాలు. ఇప్పటికే ఒకటో తేదీ నుంచి 8వ తారీఖు వరకూ జిల్లాల వారీగా జీతాలు పడుతుండడం గమనార్హం. దీనికి సాంకేతిక సమస్యలు, ఉన్నతాధికారుల సంతకాలు ఆలస్యమవడం తదితర అంశాలే కారణమని అధికారులు చెబుతున్నా.. అంతిమంగా అనుకున్న సమయానికి, అనుకున్నంత స్థాయిలో ఆదాయం రాకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తోంది.

కోవిడ్‌ విజృంభణతో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ ప్రభావం.. మన రాష్ట్ర ఖజానాపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ ఏడాది మార్చి 24 నుంచి మే వరకూ రెండునెలలకు మించి లాక్​డౌన్​ కొనసాగింది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.4వేల కోట్ల నుంచి రూ.5వేల కోట్ల మేర ఆదాయం తగ్గిందని తేలింది. ఈ ప్రభావం ఇప్పటికీ కొనసాగుతుండడం గమనార్హం. గతేడాది ఆగస్టు చివరి నాటికి రెవెన్యూ రసీదుల ద్వారా (జీఎస్టీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ల్యాండ్‌ రెవెన్యూ, అమ్మకపు పన్ను, ఎక్సైజ్‌ సుంకాలు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా తదితరాలు కలిపి) రూ.38,243 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది ఆగస్టులో ఇది రూ.31,037 కోట్లుగా నమోదైంది. అంటే రావాల్సిన ఆదాయంలో రూ.7వేల కోట్లకు మించి తగ్గిందన్నమాట. ఇక పన్నేతర ఆదాయం ద్వారా 2019 ఆగస్టులో రూ.2,024 కోట్లు సమకూరగా, ఈ ఏడాది అదేనెలలో రూ.1,373 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఈ రూపంలో మరో రూ.800 కోట్ల వరకూ తగ్గాయన్నమాట. ఇది అంతిమంగా ఖజానాపై తీవ్ర ప్రభావాన్నే చూపింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వేతనాలను చెల్లించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని సమాచారం.
ఒక్కొక్కరికి ఓ తారీఖున
ఈ క్రమంలో గతనెల హైదరాబాద్‌కు చెందిన కొందరికి 1వ తేదీన జీతాలు జమకాగా, ఖమ్మం జిల్లాకు చెందిన మరి కొందరికి ఏడో తేదీ వరకూ వేతనాలు అందలేదు. ఇక అక్టోబర్​లో కొందరికి 3వ తేదీన వేతనాలు పడగా, మరికొందరికి 5వ తేదీ వరకు జమకాలేదు. ఇలాంటి పరిస్థితి వల్ల తాము అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తున్నదని ఉద్యో గులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థికరంగ నిపుణులు ఏమన్నారంటే..
ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులున్నా సరైన క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా అలాంటి పరిస్థితులను చక్కదిద్దవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు ‘క్యాష్‌ మేనేజ్‌ మెంట్‌ సామర్థ్యం లేనప్పుడే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయి’ అని అభిప్రాయపడుతున్నారు.

1వ తేదీనే ఉద్యోగులు, టీచర్ల జీతాలు ఇవ్వాలి
రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రతినెల మొదటి తేదీనే వేతనాలు చెల్లించాలి. గత జనవరి నుంచి ఒక్కో డీడీవో పరిధిలోని ఉద్యోగులకు ఒక్కో తేదీన 1 నుంచి 10వ తేదీ వరకు వేతనాలు అకౌంట్లలో జమవుతున్నాయి. తొలుత సాంకేతిక ఇబ్బందులు అనుకున్నాం. కానీ ప్రతినెలా ఇదొక ఆనవాయితీగా ఆర్థికశాఖ పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. పనిచేసిన కాలానికి ఇచ్చే వేతనం నెల మొదటి తేదీనే ఇవ్వాలని కూడా రాష్ట్రంలో డిమాండ్ చేయాల్సి రావడం నిజంగా విచారకరం. ఈ నెల 7వ తేదీ నాటికి ఇంకా ఆదిలాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో టీచర్ల సెప్టెంబర్ జీతాలు జమకాలేదు. ఉద్యోగులు, టీచర్లు తమ కుటుంబ అవసరాల కోసం తాము దాచుకున్న జీపీఎఫ్ సొమ్ము నుంచి మంజూరు చేయించుకున్న జీపీఎఫ్ రుణాలు, పాక్షిక ఉపసంహరణ, రిటైరైన, మరణించిన ఉద్యోగుల తుది చెల్లింపులు పొందడానికి కూడా నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. మెడికల్ రీయింబర్స్​మెంట్, సరెండర్ లీవ్, రిటైర్డ్​అయిన ఉద్యోగుల సెలవు జీతాల సొమ్ము విడుదల చేయడంలో కూడా విపరీతమైన జాప్యం జరుగుతోంది.
:: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి,