సారథిన్యూస్, హైదరాబాద్: కృష్ణా నదిపై చేపట్టనున్న ప్రాజెక్టులపై కొంతకాలంగా ఏపీ, తెలంగాణ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ఆపాలని తెలంగాణ సర్కార్ డిమాండ్ చేస్తున్నది. ఈ విషయంపై సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేసింది టీ సర్కారు. అయితే శ్రీశైలం ఎడమగట్టు వద్ద తెలంగాణ జలవిద్యుత్ ఉత్పత్తి చేయడంపై ఏపీ సర్కార్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. కాగా ఈ వివాదంపై తాజాగా కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకున్నది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా రెండు రాష్ట్రాల వారు కొత్తప్రాజెక్టులు చేపట్టవద్దని కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఇరు రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. త్వరలోనే అపెక్స్ కౌన్సిల్ రెండో భేటీ నిర్వహించాలని కోరారు. రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం లోపించిందని.. జలవివాదాలపై చర్చించడం కోసం అపెక్స్ కమిటీ సమావేశం కావాలని సూచించారు.