Breaking News

జలదిగ్బంధంలో ఎల్బీనగర్

జలదిగ్బంధంలో ఎల్బీనగర్

  • షార్ట్ సర్క్యూట్ తో ఒకరు, సెల్లార్ లో పడి బాలుడి మృతి
  • ఎల్బీనగర్ నుంచి కోఠి వైపునకు రాకపోకల నిలిపివేత
  • చంపాపేట్​, దిల్​సుఖ్​నగర్​ మెయిన్​ రోడ్డుపై వరద పరవళ్లు
  • ధ్వంసమైన రోడ్లు.. రాకపోకలకు అంతరాయం
  • బైరమాల్ గూడ ప్రాంతాల్లో పర్యటించిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్
  • పరిశీలించిన ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి, మున్సిపల్ అధికారులు

సారథి న్యూస్​, ఎల్బీనగర్: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గడ్డిఅన్నారం, చంపాపేట్, లింగోజిగూడ, హస్తినాపురం, బీఎన్​రెడ్డి నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, మన్సురాబాద్, నాగోల్, కొత్తపేట్, కర్మన్​ఘాట్ డివిజన్ల లోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆయా కాలనీవాసులు ఇళ్లలో నుంచి కాలు బయటకు పెట్టలేని పరిస్థితి నెలకొంది. అపార్ట్​మెంట్లలోని సెల్లార్లలోకి, కొన్నిచోట్ల కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు నిస్సహాయస్థితిలో ఉండిపోయారు. బీఎన్ రెడ్డి నగర్, హస్తినాపురం డివిజన్లోని పలు కాలనీలు జలమయంగా మారాయి. హస్తినాపురం, ఓంకార్ నగర్, ఏపీ ఎస్ సీబీ కాలనీలో వరద నీటి ప్రవాహంలో అంబులెన్స్ చిక్కుకుపోయింది. అందులో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది.
రోడ్లన్నీ ధ్వంసం.. ఎక్కడి వాహనాలు అక్కడే
సరూర్​నగర్ చెరువుకు ఎగువ ఉన్న కాలనీల నుంచి వర్షపు నీరు అధిక మొత్తంలో చేరుతుండడంతో చెరువు నిండి పారుతోంది. దీంతో వరద నీటి ప్రవాహానికి సరూర్ నగర్ పోస్ట్ ఆఫీస్ నుంచి దిల్​సుఖ్​నగర్ ​వెళ్లే రోడ్డు మార్గం పూర్తిగా ధ్వంసమైంది. వరద ఉధృతి కొనసాగడంతో చైతన్యపురి, గడ్డి అన్నారం డివిజన్లలోని కోదండరాంనగర్, సీసాల బస్తీ, వివేకానంద నగర్ కాలనీ జలమయం అయ్యాయి. బస్సులు, బైక్​లు, వాహనదారులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు.
ఇద్దరు మృతి
సరూర్ నగర్ మండలంలోని సాహితీ అపార్ట్​మెంట్​సెల్లార్ లోకి వరద నీరు చేరడంతో అజిత్ సాయి(3) అనే బాలుడు ఆడుకుంటూ వెళ్లి సెల్లార్ లో పడి మృతిచెందాడు. బైరమాల్ గూడలోని సాగర్ ఎంక్లేవ్ వద్ద కాసోజు నారాయణచారి(36) ఇంట్లోకి వరదనీరు చేరడంతో షార్ట్ సర్క్యూట్ గురయ్యాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. చంపాపేట్ లోని గ్రీన్ పార్క్ కాలనీ సమీపంలో రేకుల ఇల్లు పూర్తిగా నిండిపోయాయి. సింగరేణి కాలనీ పరిసరప్రాంతాలు వరద నీటితో నుంచి ఫస్ట్ ఫ్లోర్ ను తాకాయి. చంపాపేట్ రోడ్డులో మెగా ఫంక్షన్ హాల్ నడిరోడ్డుపై వరదనీరు ఉధృతంగా ప్రవహించింది. మెగా ఫంక్షన్ హాల్ దగ్గర శ్రీ భవానీ బార్ యజమాని కాల్వను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వరద నీరు నిలిచి స్థానికంగా ఇబ్బందులు తలెత్తాయి. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు అక్కడికి చేరుకుని జేసీబీ సాయంతో బారు వద్ద నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించడంతో వరద నీరు సాఫీగా వెళ్లిపోయింది. సాగర్ రింగ్ రోడ్, బైరమల్ గూడ చెరువు నుండి పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆయా కాలనీల ప్రజలు వరద ముప్పు ఇబ్బందులకు గురయ్యారు.

దిల్​సుఖ్​నగర్​ ప్రధాన రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీరు

వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు
విషయం తెలుసుకున్న మున్సిపల్ శాఖ రాష్ట్ర మంత్రి కేటీఆర్, హోం మంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తో కలిసి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు కలిసి ముంపు బాధితులకు సహాయక చర్యలు చేపట్టారు. హయత్ నగర్ లోని ఎస్ వీ ఎస్ ఫంక్షన్ హాల్ లో పునరావాసం కల్పించారు. వరద ముంపునకు గురైన కాలనీల్లో బాధితులకు ఎలాంటి సహాయక చర్యలు కావాలన్నా వెంటనే మున్సిపల్ అధికారులను సంప్రదించాలని సూచించారు.