సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా కాలంలో చేనేత, మరమగ్గాల కార్మికులను ఆదుకోవాలన్న ప్రభుత్వ ఉద్దేశం పూర్తిగా నెరవేరకుండా పోతోంది. బ్యాంకుల నిబంధనలు వారికి రావాల్సిన డబ్బును అడ్డుకుంటున్నాయి. పలు రకాల కొర్రీలు, బుక్ అడ్జెస్ట్మెంట్ల వల్ల రాష్ట్రంలోని 4,200 మంది కార్మికులు తమకు అందాల్సిన సొమ్మును పొందలేకపోతున్నారు. చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమం కోసం 2018లో రాష్ట్ర ప్రభుత్వం త్రిఫ్ట్ ఫండ్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. 18వేల మంది చేనేత, 12 మంది పవర్లూమ్ కార్మికులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. పథకంలో భాగంగా చేనేత కార్మికులు నెలకు రూ.వెయ్యి కడితే సర్కారు అదనంగా రూ.2వేలు జమచేస్తుంది. అదే పవర్ లూమ్ విషయానికొస్తే, కార్మికుడు నెలకు రూ.వెయ్యి జమ చేస్తే.. ప్రభుత్వం మరో వెయ్యి జమ చేస్తుంది. ఈ విధంగా వారి డబ్బును పొదుపు రూపంలో ఒక ప్రత్యేక నిధి కింద ఉంచుతారు. మొత్తం 36నెలల కాలపరిమితి తీరిన తర్వాత సొమ్మును కార్మికులకు అందజేస్తారు. అది వారికి ఎంతగానో ఉపయోగ పడుతుంది.
కానీ కరోనా దెబ్బకు ఈ ఏడాది చేనేత, మరమగ్గాల కార్మికులు విలవిల్లాడిపోయారు. మార్చి నుంచి పనుల్లేకపోవడంతో అల్లాడిపోయారు. దాంతో పాటు గతంలో చేసిన అప్పులు, వాటికి వడ్డీలు తడిసి మోపెడయ్యాయి. ఈ క్రమంలో నిర్ణీత కాలపరిమితి తీరకముందే గత జులైలో (అప్పటికి 30 నెలలు పూర్తయ్యాయి) త్రిఫ్ట్ ఫండ్లోంచి డబ్బులు తీసి కార్మికులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా వారిని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలని భావించింది. ఆ మేరకు చేనేత, జౌళిశాఖ బ్యాంకులకు విజ్ఞప్తి చేసింది. పథకాన్ని పూర్తిగా ముగించి, సంబంధిత సొమ్మును కార్మికులకు అందజేయాలని కోరింది. ఇక్కడే బ్యాంకులు కార్మికుల జుట్టు పట్టుకున్నాయి.
గతంలో చేసిన అప్పులు, వాటికి వడ్డీల తాలూకూ సొమ్ము కింద దాదాపు 4,200 మంది కార్మికులకు డబ్బును అందజేయకుండా ఆపివేశాయి. గత రుణాల కింద బుక్ అడ్జెస్ట్మెంట్లు చేస్తున్నామనీ, అందువల్ల ఎంత మేర అప్పులు ఉంటే అంతమేర కోత విధించి మిగతా సొమ్మును విడుదల చేస్తామంటూ తేల్చి చెప్పాయి. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కరోనా కష్ట కాలంలో త్రిఫ్ట్ ఫండ్ డబ్బులు తమను ఆదుకుంటాయని భావిస్తే.. అందుకు భిన్నంగా బుక్ అడ్జెస్ట్మెంట్లు చేయడంబ దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బ్యాంకుల నిర్ణయం సరికాదు
అప్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెండేండ్ల పాటు మారటోరియం విధిస్తామంటూ ప్రకటించింది. ఆ నిర్ణయానికి విరుద్ధంగా రెక్కాడితేగాని డొక్కాడని చేనేత, పవర్లూమ్ కార్మికుల పట్ల బ్యాంకులు నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించడం సరికాదు. కచ్చితంగా అప్పులను వాయిదా వేయాలి. తద్వారా కార్మికుల ఖాతాలో ఎంత డబ్బుంటే అంత విడుదల చేయాలి. కరోనా నేపథ్యంలో త్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని ప్రభుత్వం ఇప్పుడు క్లోజ్ చేసి, ఆ సొమ్మును కార్మికులకు అందజేయడం మంచిదే. అయితే మళ్లీ ఈ పథకాన్ని ప్రారంభించాలి. అది ఇప్పటిలాగే ఆపదకాలంలో కార్మికులను ఆదుకుంటుంది.
:: కూరపాటి రమేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పవర్లూమ్ వర్కర్స్ యూనియన్