సారథి న్యూస్, హైదరాబాద్: ఏ ఒక్క నిరుపేదకూ బాధ కలుగకుండా, చివరి గుడిసె దాకా వాటి ఫలితాలు అందేలా చూడటమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దశాబ్దాల కాలంగా వలస పాలనలో అపరిష్కృతంగా ఉన్న నివాసస్థలాలు, సంబంధిత భూ సమస్యల పరిష్కారానికి మున్సిపాలిటీల పరిధిలోని ప్రజాప్రతినిధులు, మేయర్లతో సీఎం కేసీఆర్ గురువారం ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటికీ ఆన్ లైన్ లో నమోదుకాని ప్రజల ఇళ్లు, ప్లాట్లు, అపార్ట్మెంట్ ప్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసే ప్రక్రియలో క్షేత్రస్థాయిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. వ్యవసాయ భూములను ఆకుపచ్చ పాస్ బుక్కులు, వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్ రంగు పాస్ బుక్కులను అందజేయడం ద్వారా ప్రజలకు సంబంధించిన ప్రతి అంగుళం ఆస్తిని ఆన్ లైన్ లో నమోదుచేయనున్నట్లు చెప్పారు.
ప్రజలకోసం శ్రమించాలి
‘ఒకనాడు స్లమ్ ఏరియాల్లోని గుడిసె నివాసాలు అభివృద్ధితో నేడు పక్కా ఇండ్లు, బంగళాలుగా మారాయి. ప్రజలు మనల్ని భారీ మెజారిటీతో గెలిపించారు. వారి గుండె తీసి మన చేతుల్లో పెట్టారు. చారిత్రిక విజయాన్ని కట్టబెట్టి, మనల్ని కడుపులో పెట్టుకున్న ప్రజల కోసం అహర్నిశలూ శ్రమించాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు. నోటరీ, జీవో 58,59 ద్వారా పట్టాలు పొందిన లబ్ధిదారులకు, దశాబ్దాలుగా ఇండ్లు కట్టుకుని నివసిస్తున్న పేదలకు మేలు చేకూర్చే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని’ స్పష్టంచేశారు.
సమస్యలను వివరించిన మంత్రులు, ఎమ్మెల్యేలు
ఈ సమీక్ష సందర్భంగా సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లతో సీఎం మాట్లాడించారు. వారి వారి నియోజకవర్గాల పరిధుల్లోని ప్రజల నివాస స్థలాలు, ఇండ్లు, ఆస్తులకు సంబంధించి దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తెచ్చారు. ఆ సమస్యలను సానుకూలంగా విన్న ముఖ్యమంత్రి, ప్రతి సమస్యనూ అధికారులతో నోట్ చేయించారు. ఈ సమస్యల తక్షణమే పరిష్కారం కోసం విధివిధానాలు రూపొందించాలని సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే.తారక రామారావు, సీఎస్ సోమేశ్ కుమార్, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, అసెంబ్లీలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలు బలాల, కౌసర్ మొహినొద్దీన్, పాషాఖాద్రీ, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, సుధీర్ రెడ్డి, దానం నాగేందర్, సాయన్న, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, వివేకానంద, కాలేరు వెంకటేశ్, మైనంపల్లి హన్మంతరావు, ముఠా గోపాల్, ప్రకాశ్ గౌడ్, మహిపాల్ రెడ్డి, బేతి సుభాష్ రెడ్డి, ఆరూరి రమేష్, బాల్క సుమన్, నన్నపునేని నరేందర్, గణేష్ బిగాల, బొల్లం మల్లయ్య యాదవ్, కోరుకంటి చందర్, పైళ్ల శేఖర్ రెడ్డి, అంజయ్య యాదవ్, హైదరాబాద్ నగర్ మేయర్ బొంతు రాంమోహన్, కార్పొరేషన్ల మేయర్లు, జక్కా వెంకట్ రెడ్డి, నీలం గోపాల్ రెడ్డి, గుండా ప్రకాశ్ రావు, సునీల్ రావు, దుర్గ, ఇతర మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.