న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని తాను తొలిసారి కలిసినప్పుడు అంత ఈజీగా నమ్మలేదని సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. విరాట్ వ్యవహార శైలి చూసి మరింత అభద్రతా భావానికి లోనయ్యానని చెప్పాడు. ‘మేమిద్దరం తొలినాళ్లలో కలిసినప్పుడు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి.
అప్పటికే మార్క్ బౌచర్ చాలాసార్లు కోహ్లీ గురించి చెప్పాడు. 18, 19 ఏళ్ల వయసు నుంచే ఆర్సీబీకి ఆడుతున్నాడని తెలుసు. మూడేళ్ల ముందుగానే విరాట్ గురించి తెలిసినా ఎప్పుడూ కలిసే చాన్స్ మాత్రం రాలేదు. ఓ మ్యాచ్ కోసం మనమిద్దరం టన్నెల్లో వెళ్తున్నప్పుడు హాయ్ అని పలుకరించుకున్నాం.
కానీ అప్పటికే అభద్రతాభావం ఉండడం వల్ల అంత తేలికగా నమ్మొద్దని అనుకున్నా. నీ హెయిర్ స్టైల్, వ్యవహార శైలి చూశాకా ఇది మరింత పెరిగింది’ అని ఇన్ స్టాగ్రామ్ లైవ్ సెషన్లో ఏబీ వెల్లడించాడు. ఇక విరాట్ కూడా తమ ఇద్దరి ఫస్ట్ మీటింగ్ గురించి ఆసక్తికరంగా చెప్పాడు.
‘జొహన్నెస్ బర్గ్ లో నేను ఫస్ట్ టైమ్ ఏబీని కలిశా. అతను అప్పుడే ప్రాక్టీస్ ముగించుకుని వస్తున్నాడు. నేను ప్రాక్టీస్ కోసం వెళ్తున్నా. హలో అని పలకరించి.. మనిద్దరం కలిసి ఆడబోతున్నాం అని చెప్పా. ఇద్దరి మధ్య బ్రీఫ్ చాట్ జరిగింది.
కానీ తొమ్మిదేళ్ల తర్వాత ఇంత మంచి ఫ్రెండ్స్ అవుతామని ఎవరికి తెలుసు. నీతో ఎన్నో మధురానుభూతులు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది’ అని కోహ్లీ తెలిపాడు.