Breaking News

కోల్​ బెల్ట్​లో ఎండ కాక

  • 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు

సారథి న్యూస్​, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండం కోల్​ బెల్డ్​ ఏరియాలో భానుడు భగభగ మండిపోతున్నాడు.. రోజురోజుకూ ఎండ, వడగాలుల తీవ్రత భరించలేక జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. అసలే వేసవి.. ఆపై రోహిణి కార్తె తోవడంతో సూరీడు తన ప్రతాపం మరింత చూపడంతో ఇల్లు దాటి కాలు బయటపెట్టేందుకు పారిశ్రామికవాడలో జనం జంకుతున్నారు. జిల్లాలో వారం 46 డిగ్రీల సెంటిగ్రేడ్​ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రామగుండం కోల్​ బెల్ట్ ప్రాంతమైన రామగుండం, ఎన్టీపీసీ, గోదావరిఖని, కేశవరం, బసంతనగర్, 8 ఇంక్లెయిన్ కాలనీ, రామగిరి ప్రాంతాల్లో ఎండవేడికి రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఉదయం 9 గంటలలోపు , సాయంత్రం ఆరుగంటల తర్వాత జనం తమ పనులు చేసుకుంటున్నారు. మొన్నటి వరకు కరోనా భయంతో బయటకు రాని జనం, లాక్ డౌన్ సడలింపుతో బయటికి వచ్చినా మధ్యాహ్నం ఇళ్లకు చేరుకుంటున్నారు. ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరుగుతున్నా అటు కరోనా.. ఇటు వడగాలుల భయంతో ఎంత అత్యవసర పని ఉన్నా ప్రయాణించడం లేదు. ద్విచక్ర వాహనదారులైతే నానాఇబ్బందుల మధ్య రాకపోకలు సాగిస్తున్నారు.
కాక పుట్టించే వేడి
పెద్దపల్లి జిల్లా రామగుండం కోల్ బెల్ట్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. గనుల ప్రాంతాల్లో రోజు 46 నుంచి 47 డిగ్రీల సెంటిగ్రేడ్​ ఉష్ణోగ్రత రికార్డ​వుతోంది. ఎండ తీవ్రత దృష్ట్యా కార్మికులు చాలామంది డ్యూటీలకు హాజరుకావడం లేదని కార్మికవర్గాలు చెబుతున్నాయి. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం కార్మికులకు మజ్జిగ పంపిణీ చేస్తోంది. ఉష్ణోగ్రతలతో ఓపెన్ కాస్ట్ రోడ్లపై దుమ్ము విపరీతంగా లేస్తోంది. దీంతో డంపర్ వెనుక వెళ్తున్న మరో డంపర్ కు కనీసం దారి కూడా కనిపించడం లేదు అని ఆపరేటర్లు పేర్కొంటున్నారు. అధికారులు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీళ్లు చల్లించినా ఎండవేడికి వెంటనే ఆరిపోయి దుమ్ములేస్తోంది. మొత్తంగా పెద్దపెల్లి జిల్లాలో ఎండ, వడగాలి తీవ్రత తీవ్రంగా ఉంది.
ముదురుతున్న ఎండలు
ఎండల తీవ్రత మరో 45 రోజులు పాటు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ప్రస్తుతం నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది, ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు అత్యవసరమైతేనే తప్ప బయటికి వెళ్లొద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఉదయం, సాయంత్రం పూట మాత్రమే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు.