సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా కోరలు చాచింది.. కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది.. కొత్త వ్యక్తులకు అంటుకుంటోంది.. తెలంగాణలో ఆదివారం కొత్తగా 237 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3 మంది మృతిచెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో నుంచి అత్యధికంగా 195 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 4,974 కు చేరింది. ఇప్పటివరకు 185 మంది మృత్యువాతపడ్డారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ డిశ్చార్జ్ అయినవారు 2,377 మంది దాకా ఉన్నారు. తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,412కు చేరింది. అత్యధికంగా మేడ్చల్ జిల్లా నుంచి 10 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 8 కేసులు పాజిటివ్‌గా తేలాయి. సంగారెడ్డి జిల్లాలో ఐదు, మంచిర్యాలలో మూడు, వరంగల్ అర్బన్ జిల్లాలో రెండు, కామారెడ్డి జిల్లాలో రెండు, నిజామాబాద్ జిల్లాలోరెండు, మహబూబ్ నగర్లో రెండు చొప్పున కేసులు నమోదు కావడం గమనార్హం.
పెరుగుతున్న మహమ్మారి
కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఆదివారం నిజామాబాద్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు కరోనా పాజిటివ్ గా తేలడంతో ఆయనను హుటాహుటిన హైదరాబాద్ కు తీసుకెళ్లారు. అలాగే మంత్రి ఈటల రాజేందర్ ఓఎస్డీ గంగాధర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. నిన్నటి మొన్నటి వరకు ఆయన మంత్రి ఈటల రాజేందర్ వెంటే తిరిగారు. ఇలా ప్రజాప్రతినిధులు, వారి పీఏలు, డ్రైవర్లకు కరోనా అంటుకోవడంతో ఎవరెవరికి వస్తుందోనని అందరిలోనూ భయాందోళన నెలకొంది. తాజాగా 23 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ కావడం ఆందోళన కలిగిస్తోంది. 147 మందికి మెడికల్ టెస్ట్‌లు నిర్వహించగా 23 మందికి పాజిటివ్ గా నిర్దారించారు. ఈ విషయం హైదరాబాద్ మీడియా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
- June 14, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CAROONA
- HYDERABAD
- కరోనా
- జర్నలిస్టులు
- జీహెచ్ఎంసీ
- పాజిటివ్ కేసులు
- Comments Off on కోరలు చాచిన కరోనా