న్యూఢిల్లీ : దేశంలో కరోనా రికవరీలు పెరుగుతున్నా.. గతనెలతో పోల్చితే రోజూవారీ కేసులలో తగ్గుదల కనిపిస్తున్నా.. వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు. రోజూ 75 వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. సోమవారం నమోదైన కొత్త కేసుల (74,441) తో కలిపి.. భారత్ లో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 66,23,815 కు చేరుకున్నది. మరోవైపు మరణాల సంఖ్య కూడా ఇటీవలే లక్ష దాటింది. గత 24 గంటల్లో మరణించిన 903 మందితో కలిపి… దేశంలో కోవిడ్-19 సోకి మరణించిన వారి సంఖ్య 1,02,695 కు చేరింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా.. కేసులలో అమెరికా తర్వాత భారత్ రెండోస్థానంలో ఉన్నది. మరణాల విషయంలో మూడ స్థానంలో ఉంది. ఇప్పటికీ ప్రపంచంలో ఇప్పటికీ రోజూవారీ కేసులు ఎక్కువగా వస్తున్న దేశాల్లో ప్రథమస్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. మరోవైపు అన్ లాక్ ల దశ కూడా దాదాపు పూర్తి కావొచ్చింది. ఒక్క సినిమా హాళ్లు, పార్కులు తప్ప ఇప్పుడు అన్నీ ఓపెన్ అయ్యాయి. రోడ్ల మీద సాధారణ జీవితం ఎప్పట్నుంచో మొదలైంది. బాధ్యత లేకుండా ప్రవర్తించడం వల్ల చాలా మంది ఈ వైరస్ బారిన పడుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నా.. జనాల వైఖరిలో మార్పులు రావడం లేదు.
లక్ష దాటిన మరణాలు: ప్రపంచాన్ని అల్లాడిస్తున్న కరోనా వైరస్ ఉధృతి తగ్గుతున్నా మరణాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడి 10 లక్షల మందికి పైగా మరణించగా భారత్ లో ఆ సంఖ్య లక్షకు చేరింది. భారత్ లో కరోనా సోకిన మరణించిన వారి సంఖ్య లక్ష దాటింది. మరణాల జాబితాలో అమెరికా తర్వాత రెండో స్థానంలో బ్రెజిల్ ఉన్నది. ఈ వైరస్ సోకి అమెరికాలో 2 లక్షలకు పైగా మంది చనిపోయారు. బ్రెజిల్లో లక్షా 45 వేలు దాటాయి. కరోనా పాజిటివ్ కేసుల ట్రెండ్ ఇలాగే కొనసాగితే త్వరలోనే భారత్ అమెరికా ను దాటిపోవచ్చునని గణాంకాల ద్వారా స్పష్టమవుతున్నది. జనవరి 30న భారత్ లో తొలి కరోనా కేసు నమోదు కాగా.. అప్పటి నుంచి ఇప్పటివరకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా గత నెలలోనే 40 శాతం కేసులు నమోదవడం గమనార్హం. ప్రస్తుతం ఉన్న మొత్తం కేసులలో సుమారు 25 లక్షల వరకు ఒక్క సెప్టెంబర్లోనే నమోదయ్యాయి. మొత్తం మరణాలలో 34 శాతం దాకా సెప్టెంబర్ లో నమోదైనవే.