- నీటి వాటా ప్రకారమే తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మిస్తున్నం
- కేంద్రం, ఏపీ ప్రభుత్వానికి సమాధానం చెబుతం
- తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదులు చేయడం సరికాదు
- అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వాస్తవాలు వెల్లడిస్తాం
- జలవనరులశాఖ అధికారులతో సీఎం కె.చంద్రశేఖర్‌రావు
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్థం పర్థం లేని, నిరాధారమైన, అనవసర రాద్ధాంతం చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంభిస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో పూర్తి వాస్తవాలు, సంపూర్ణ సమాచారం ముందు పెట్టి సమర్థవంతంగా వాదనలను వినిపించాలని నిర్ణయించారు. ఇటు ఆంధప్రదేశ్ ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి గట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సముద్రం పాలవుతన్న నీటిని రైతుల పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలుచేద్దామని చెప్పానని, అయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రగతి భవన్ లో జలవనరులశాఖ అధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదులు చేయడంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
బేసిన్లు లేవు, భేషజాలు లేవని చెప్పిన
‘నా అంతట నేనే ఆంధప్రదేశ్ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటవేసి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహహస్తం అందించాం. బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని మన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పాం. సహజ సరిహద్దు రాష్ట్రాలు కాబట్టి స్నేహపూర్వకంగా మెదిలి, అంతిమంగా రైతులకు సాగునీరు అందించే లక్ష్యం సాధించాలని ప్రతిపాదించాం. అపెక్స్ కమిటీ సమావేశంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం నోరు మూయించేలా, వారి అర్థ రహిత వాదనలను తిప్పికొట్టేలా సమాధానం చెబుతాం. తెలంగాణ ప్రాజెక్టుల గురించి మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని కల్పిస్తాం’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
కేంద్రం వైఖరి తప్పిదమే
‘తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా తప్పిదమే. తెలంగాణ రాష్ట్రానికున్న నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికే నీటి కేటాయింపులు జరిగి, అనుమతులు పొంది, ఖర్చు కూడా జరిగిన ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏమాత్రం సరికాదు’ అని ఆయన అన్నారు.
శ్రీశైలం సాగునీటి ప్రాజెక్టు కాదు
‘శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే విషయంలో కూడా కేంద్రం అనవసరంగా అభ్యంతర పెడుతోంది. వాస్తవానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నింపిన తర్వాతే మిగిలిన ప్రాజెక్టులు నింపాలి. అసలు శ్రీశైలం ప్రాజెక్టు నీటి పారుదల ప్రాజెక్టు కాదు, అది జలవిద్యుత్ ప్రాజెక్టు. ఇన్ని వాస్తవాలు పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడం సమంజసం కాదు. ఒక రాష్ట్రంగా తెలంగాణకు కూడా హక్కులుంటాయి. తనకున్న హక్కు ప్రకారం ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఈ విషయంలో రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరించడం తగదు. కేంద్ర వైఖరిని కూడా యావత్ దేశానికి తెలిసేలా చేస్తాం. అన్ని వాస్తవాలు వెల్లడిస్తాం’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
హక్కుల ప్రకారమే ప్రాజెక్టులు
‘గోదావరి, కృష్ణా బేసిన్లలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న హక్కుల ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. తెలంగాణ ఏర్పడే నాటికే ఇప్పుడు నిర్మిస్తున్న ప్రాజెక్టులు మంజూరయ్యాయి. సీడబ్ల్యూసీ సహా ఇతర సంస్థల నుంచి అనుమతులు వచ్చాయి. దాదాపు రూ.23వేల కోట్ల వరకు నిధులు ఖర్చుచేశాం. 31,500 ఎకరాల భూసేకరణ జరిగింది. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు వీటిని కొత్త ప్రాజెక్టులు అనడం అర్థరహితం, అవివేకం. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మంజూరైనప్పటికీ వాటిని పూర్తిచేయలేదు. పైగా తక్కువ నీటితో ఎక్కువ ఆయకట్టును ప్రతిపాదించారు. దీని వల్ల సాగునీటి అవసరాలు సంపూర్ణంగా తీరవు. చాలా ప్రాజెక్టుల డిజైన్ తెలంగాణ రాష్ట్ర అవసరాలకు తగ్గట్టు లేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటి కేటాయింపులు జరిపి, ప్రతిపాదించిన ప్రాజెక్టులు కట్టడం లేదనే అసంతృప్తితోనే, నీటి పారుదల రంగంలో జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం వచ్చింది’ అని సీఎం కేసీఆర్గుర్తుచేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరం, కంతనపల్లి ప్రాజెక్టును రీ డిజైన్ చేసి సమ్మక్క సాగర్, రాజీవ్ సాగర్ -ఇందిరా సాగర్ ప్రాజెక్టులను రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టు, దుమ్ముగూడెం ప్రాజెక్టును రీడిజైన్ చేసి సీతమ్మ సాగర్ ను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలోనూ వాస్తవాలను మరోసారి వివరిస్తామన్నారు.
ఆ ప్రాజెక్టులను ఇప్పుడు పూర్తిచేశాం
‘సమైక్య ఆంధ్రప్రదేశ్ లో చేపట్టిన జూరాలతో పాటు నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా, కోయల్ సాగర్ ప్రాజెక్టులను తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తి చేసుకోగలిగాం. ఆర్డీఎస్ తూములను ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు బాంబులు పెట్టి పేల్చితే గ్రావిటీ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాలేదు. ఆర్డీఎస్ ఆయకట్టును స్థిరీకరించడానికి ఎంతో వ్యయం చేసి తుమ్మిళ్ల లిఫ్టు నిర్మించుకోవాల్సి వచ్చింది. ఇలా సాగునీటి రంగంలో అంతులేని అన్యాయం జరిగింది.’ అని సీఎం కేసీఆర్ వివరించారు.