Breaking News

ఎవరికీ పట్టని వారియర్స్ బాధలు

ఎవరికీ పట్టని వారియర్స్ బాధలు

కరోనా మహమ్మారి భయానికి దేశమంతట తలుపులకు గొళ్లాలుపడ్డాయి. వైరస్​కోరలకు తామెక్కడ చిక్కుకోవాల్సి వస్తుందోనని ఇరుగుపొరుగుతో బంధాలు తెంచుకున్నాయి. కానీ, ఆరోగ్య కార్యకర్తలు మాత్రం మహమ్మారి సైరన్​దేశంలో మోగడంతోనే గడపదాటారు. ఇంట్లోని పిల్లాజల్లా వద్దని వాదించినా దేశమంతా లాక్​డౌన్​లో ఉంటే వీళ్లు మాత్రం ప్రాణాలకు తెగించి రోడ్డెక్కారు. ముఖ్యంగా మహిళలు పేగులు మెలిపెట్టే నెలసరి నొప్పులు, దీర్ఘకాలికంగా ఉన్న ఆరోగ్య సమస్యలను లెక్కచేయకుండా కరోనా కట్టడికి అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ ఏ మాత్రం అలుపెరగకుండా కరోనాతో కంటికి కనిపించని యుద్ధం చేస్తున్నారు. వీళ్లు విధి నిర్వాహణలో ఎదుర్కొంటున్న సవాళ్లు ఎన్నో.. వైరస్​వ్యాప్తితో వణికిపోతూ మానవత్వం మరిచి అయినవాళ్లనే పక్కకునెట్టిన కథలెన్నో.

కానీ, మహిళా ఆరోగ్య కార్యకర్తలు మాత్రం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రమాదకర వైరస్​తో పోరాడుతున్నారు. మహిళా డాక్టర్లు, నర్సులు ఊపిరాడని భారీ పీపీఈ కిట్లతో రోగులకు సేవలు చేస్తే, ఆశావర్కర్లు కాంటాక్ట్​కేసులను వెతుక్కుంటూ ఊళ్లన్నీ జల్లెడపడుతున్నారు. వీళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు వింటే ప్రతి గుండె కన్నీళ్లు కారుస్తోంది. వీళ్ల ఓర్పు, త్యాగాలకు మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తోంది.

నెలసరిలో ఉక్కిరిబిక్కిరి
ఆడవాళ్లు నెలసరి సమయంలో శారీరకంగానే కాదు మానసికంగానూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. క్రాంప్స్, మూడ్​స్వింగ్స్​తో ఐదురోజులు తీవ్రఒత్తిడిలో ఉంటారు. అలాంటి సందర్భంలో పీపీఈ కిట్లతో డ్యూటీ అంటే ఒక విధంగా నరకమే. రుతుస్రావంలో పదేపదే ప్యాడ్స్​మార్చుకోవాల్సి ఉంటుంది. కానీ, పీపీఈ కిట్లు ధరిస్తే వాష్​రూమ్​కి వెళ్లే అవకాశం ఉండదు. పైగా ఏం తినడానికి, తాగడానికి వీలుండదు. దాంతో రుతుస్రావం మరకల మధ్య కడుపు మాడ్చుకుని డ్యూటీ చేస్తున్నారు హెల్త్​వర్కర్స్. తద్వారా డీహైడ్రేషన్, యూరిన్​ఇన్ ఫెక్షన్​వంటి సమస్యలతో బాధపడుతున్నారు.

డ్రెస్సింగ్​తో తంటాలు
స్త్రీ, పురుషులిద్దరూ వేసుకోవడానికి అనువైనవని చెబుతున్నప్పటికీ.. మహిళల విషయానికి వచ్చేసరికి పీపీఈ కిట్లు కంఫర్ట్​గా ఉండడం లేదు. ఎందుకంటే అవి ప్యాంట్, షర్ట్​ఫార్మాట్​లో ఉంటున్నాయి. అందులో కూడా చిన్నసైజు పీపీఈ కిట్లు కూడా మహిళలకు వదులుగా ఉంటున్నాయని కొందరు ఆరోగ్య కార్యకర్తలు చెబుతున్నారు. ప్రపంచ వైద్యవ్యవస్థలో సుమారు 70శాతం మంది పీపీఈ కిట్లతో సంతృప్తిగా లేరని సర్వేలు చెబుతున్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో పీపీఈ కిట్ల అగచాట్లు చెప్పుకోలేనన్ని ఉన్నాయి. మన వద్ద ఎక్కువమంది ఆరోగ్య కార్యకర్తలు చీరలే కట్టుకుంటారు. చాలా ఆస్పత్రుల్లో నర్సుల డ్రెస్​ కోడ్​కూడా చీరలే. అలాంటిది చీరలపై పీపీఈ కిట్లు అంటే కనీసం నడవడానికి కూడా సౌకర్యంగా ఉండదు. అలాంటి కంఫర్ట్​లేని దుస్తులతో గంటల తరబడి డ్యూటీ చేయడం ఇబ్బందిగా ఉందంటుందని డ్యూటీ డాక్టర్లు, నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నర్సుల నాన్​స్టాప్ ​డ్యూటీలు
కరోనా రాసిన కన్నీటి కథల్లో ఎక్కువగా కనిపించినవి నర్సులవే. కరోనా కేసులు పెరుగుతుండడంతో గవర్నమెంట్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నర్సులకు డబుల్​డ్యూటీలు వేశాయి. అవసరాన్ని అర్థం చేసుకుని వాళ్లు కూడా దేనికీ వెనకాడట్లేదు. అవసరం ఉండి సెలవులు అడిగినా, పరిస్థితి బాగోలేదని యాజమాన్యాలు మంజూరు చేయట్లేదు. ఇప్పటికీ సీనియర్​ డాక్టర్స్​లో చాలామంది ఆన్​లైన్​కన్సల్టెన్సీలకే ప్రాధాన్యమిస్తున్నారు. కానీ, నర్సులకు అలాంటి వెసులుబాటు ఉండదు. కరోనా బాధితుల్లో ప్రతిక్షణం ధైర్యం నింపుతూ కుటుంబ సభ్యులు లేనిలోటుని భర్తీచేస్తున్నారు. కానీ, ఓవర్​టైమ్​డ్యూటీల వల్ల చాలామంది డిస్క్​ సమస్యలను ఎదుర్కొంటున్నారు.

తల్లి మనసు భారమవుతోంది
తండ్రి ఎంత ప్రేమ కురిపించినా, ఎంత గారాబం చేసినా తల్లి స్పర్శ తగలకపోతే పిల్లలు ఉండలేరు. కేవలం పసిపిల్లలే కాదు, పదేళ్ల పిల్లలు కూడా తల్లి పక్కన పడుకుంటేనే నిద్రపోతారు. కానీ, హెల్త్​డిపార్ట్​మెంట్​లో పనిచేస్తున్న ఎంతోమంది తల్లులు కొన్నినెలలుగా పిల్లలకు దూరంగా ఉంటున్నారు. తమవల్ల కుటుంబ సభ్యులు ఎక్కడ వైరస్​ బారిన పడతారోనని ఇంటికి దూరంగా ఉంటున్నారు. ఒక నర్సు తన ఆవేదనను ఇలా చెప్పుకొచ్చింది. ‘ఒక కార్పొరేట్ హాస్పిటల్​లో నర్సుగా పనిచేస్తున్నాను. నాకు ఏడాదిన్నర వయసున్న పాప ఉంది. రోజంతా కరోనా పేషెంట్ల మధ్య ఉంటున్నాను కాబట్టి పాపను నా దగ్గర పెట్టుకోవడం కరెక్ట్​కాదనిపించింది. అందువల్ల ఐదు నెలల క్రితమే మా పాపను అమ్మవాళ్ల ఊరికి పంపించాను. రోజూ తనను వీడియో కాల్​లో చూస్తూ చాలా ఎమోషనల్​ అయిపోతున్నాను. ఒక్కోసారి జాబ్​మానేయాలనిపిస్తోంది. కానీ నమ్ముకున్న వృత్తిని వదిలిపెట్టలేం కదా’ అంటూ వాపోయింది నర్సు సుజాత(పేరు మార్చాం).

మేమూ పేషెంట్లమయ్యాం
‘రోజుకు నాలుగైదు లీటర్ల నీళ్లను తాగమని మేమే రోజూ కరోనా పేషంట్స్​కి చెబుతున్నాం. వాళ్లలో రోగనిరోధక శక్తి పెరగడానికి పౌష్టికాహారాన్ని ఎక్కువగా తీసుకోమ్మని సలహా ఇస్తున్నాం. కానీ, ఫేస్​షీల్డ్, పీపీఈ కిట్ల వల్ల మాకు డ్యూటీలో ఉన్నప్పుడు గొంతులో నీటి చుక్కపడట్లేదు. ఆకలిగా ఉన్నా ఆహారం తీసుకోవట్లేదు. దానివల్ల గ్యాస్​ట్రబుల్, మైగ్రేన్​ సమస్యలు వస్తున్నాయి. ఇంకా పీరియడ్స్​లో అయితే ఆ బాధ నరకంగా ఉంది. బ్లీడింగ్​ ఎక్కువైనా ప్యాడ్స్​మార్చుకోలేకపోతున్నాం. నేనైతే ఇంటికెళ్లాక కూడా సరిగ్గా తిండి తినలేక పోతున్నా.. ఫ్యామిలీని రిస్క్​లో పెడుతున్నానేమో అనే టెన్షన్​తో నిద్రపట్టట్లేదు. ఆగస్టులో మా కొలీగ్​డాక్టర్​కు కరోనా పాజిటివ్​వచ్చింది. అప్పుడు నేను ఆమెను కాంటాక్ట్ అవ్వడంతో 14 రోజులు ఇంట్లోనే ఐసోలేట్ అయ్యాను. అప్పుడు నేను అనుభవించిన మెంటల్​స్ట్రెస్​ అంతాఇంతా కాదు’ అని డాక్టర్​సరిత(పల్మనాలజిస్ట్) చెప్పుకొచ్చారు.

ఉద్యోగం మానేయమన్నారు
‘మూడేళ్ల నుంచి గవర్నమెంట్​హాస్పిటల్​లో కాంట్రాక్ట్​నర్సుగా పనిచేస్తున్నా.. కరోనా టైమ్​లో రోజుకు 12 నుంచి 14 గంటల పాటు కరోనా పేషెంట్ల మధ్య గడిపా. కొన్నికొన్ని సార్లు రాత్రిళ్లు రాకపోకలు ఎందుకని హాస్పిటల్​లోనే నిద్రపోయా. ఇంత కష్టపడ్డా హాస్పిటల్​ సిబ్బంది నన్ను కాంట్రాక్ట్ ఉద్యోగిగానే చూశారు. నాన్​స్టాప్​డ్యూటీలు వేశారు. కానీ, వచ్చే రూ.15వేలకు ఎందుకింత రిస్క్​అంటూ ఇంట్లో వాళ్లు గొడవకు దిగారు. అత్తమామలు జాబ్​ వదలట్లేదని కొన్నాళ్లు మాటలే మానేశారు. మా అమ్మానాన్న కూడా ఉద్యోగం విషయంలో సపోర్ట్ చేయలేదు. వాళ్లందరి ఒత్తిడి భరించలేక నెల క్రితం ఉద్యోగానికి రాజీనామా ఇచ్చా. కానీ, దాన్ని కూడా అప్రూవ్​చేయకుండా ఇలాంటి సిచ్యుయేషన్​లో​మేము రాజీనామా అప్రూవ్​చేయలేమంటోంది హాస్పిటల్​యాజమాన్యం. దీంతో ఉద్యోగం, కుటుంబం మధ్య నలిగిపోతున్నా’ అంటూ కాంట్రాక్ట్​నర్సు హేమలత (పేరు మార్చాం) కన్నీళ్లతో తన బాధను చెప్పుకొచ్చింది.

మోడల్ ​మార్చాలి
‘52 ఏళ్ల వయసులో డయాబెటిక్​తో బాధపడుతున్నప్పటికీ.. ప్రజల ఆరోగ్యం కోసం పోరాడుతున్నా. కరోనా పాజిటివ్​పేషెంట్లకు రాత్రిపగలు అని తేడా లేకుండా సేవలు చేస్తున్నా. ఆ క్రమంలో నాతో పనిచేసేవాళ్లు, వాళ్ల కుటుంబసభ్యులు ఎంతోమంది కరోనా బారినపడ్డారు. అలాంటి వార్తలు విన్న ప్రతిసారి నా పిల్లలు, భర్త కళ్లముందే మెదిలారు. కానీ, సైనికురాల్ని కదా.. అందుకే యుద్ధం నుంచి పారిపోయే ప్రయత్నం చేయలేదు. అయితే ఈ యుద్ధానికి కవచమైన పీపీఈ కిట్లు మాత్రం సరిగా లేవు. మహిళల కోసం ప్రత్యేకంగా పీపీఈ కిట్లు తీసుకొస్తే బాగుండు అనిపిస్తుంది.’ అని నిమ్స్​హాస్పిటల్ లో పనిచేస్తున్న హెడ్​నర్స్​జి. నిర్మల అంటున్నారు

ప్రభుత్వం నుంచి మొండిచేయి
కరోనా వైరస్​మన దేశంలో అడుగుపెట్టిన దగ్గర్నుంచి ఆశావర్కర్లు నిద్రాహారాలు మాని ప్రజలు కోసం పనిచేస్తున్నారు. కరోనా కట్టడికి ప్రతిక్షణం పాటుపడుతున్నారు. ఊళ్లో ఎవరికి కరోనా సోకినా పరుగుపరుగున వాళ్లని హాస్పిటల్​కు తరలిస్తున్నారు. బాధితులతో కాంటాక్ట్​ అయిన వాళ్లందరినీ ట్రేస్​చేసి కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తున్నారు.. కానీ, ప్రజల ఆరోగ్యం కోసం ఇంత చేసే వీళ్లని ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి.
‘మే నెల మొదటివారం మా ఊళ్లో మొదటి కరోనా కేసు నమోదైంది. ఆ విషయం తెలియడమే ఆలస్యం ఊరంతా తిరిగి కాంటాక్ట్​ కేసులను గుర్తించాం. అనుమానితుల్ని క్వారంటైన్​కేంద్రాలకు తరలించాం. ఊరు మధ్యలో మండుటెండలో టెంట్​ వేసుకుని, రెడ్​జోన్​ఏరియాలోకి ఎవరూ ప్రవేశించకుండా కాపలాకాశాం. ఇప్పుడు కుండపోత వర్షంలోనూ గొడుగులు వేసుకుని డ్యూటీలు చేస్తున్నాం. కరోనా టెన్షన్​ వల్ల కడుపునిండా తినలేకపోతున్నాం. అంతేకాదు, ఇంటికొచ్చాక కూడా పిల్లలకు వండి పెట్టాలన్నా భయపడతున్నాం. ప్రాణతీపిని పక్కనపెట్టి కుటుంబసభ్యులకు దూరంగా ఉంటూ డ్యూటీ చేస్తే.. ప్రభుత్వం మాకు మూడునెలలు మాత్రం నెలకు రూ.750 ఇన్సెంటివ్​ఇచ్చింది’ అని ఆశావర్కర్​ సూర్యాపేట జిల్లాకు చెందిన సంధ్య అంటోంది.

కుటుంబాన్ని వెళ్లదీయలేకపోతున్నా..
‘పేరుకు గవర్నమెంట్ సంస్థ అయినా ఇతర గవర్నమెంట్​ఉద్యోగులకు ఉన్నన్ని వెసులుబాట్లు ఆశావర్కర్లకు ఉండవ్​. ఆదాయం కూడా పెద్దగా ఉండదు. ఒక గర్భిణిని మొదటి నెలనుంచి డెలివరీ అయ్యే వరకు ప్రతి రెండు నెలల చెకప్ కు తీసుకెళ్లి గవర్నమెంట్​హాస్పిటల్​లో డెలవరీ చేయిస్తే ప్రభుత్వం మాకు రూ.1500 ఇస్తుంది. అంతేతప్ప నెల జీతమంటూ ఏం ఉండదు. అయినా సరే గవర్నమెంట్​సంస్థ కదా! అని ఇన్నాళ్లూ ఉద్యోగం చేసుకుంటూ వచ్చా. నాకొచ్చే అరకొర ఆదాయంతో కుటుంబాన్ని వెళ్లదీయలేక చాలా ఇబ్బందులు పడుతున్నా. ఆశావర్కర్​గా ఉండలేక వేరే పని చూసుకుందామనుకుంటున్నా’ అని నిజామాబాద్​కు చెందిన శ్యామల అనే మరో ఆశావర్కర్ బాధపడుతోంది.

సేవకులకు సాయం అందట్లేదు
– కరోనా భయం గుండెలను తొలిచేస్తున్నా, బాధ్యతను మర్చిపోకుండా పనిచేస్తున్న నర్సులకు ఓవర్​డ్యూటీలు తప్ప ఇన్​సెంటివ్స్​ లేవు. కరోనా కేసులు మొదలై నెలలు గడుస్తున్నా.. ఓటీ డబ్బుల కోసం ఇంకా పోరాడుతున్నారు.
– హెల్త్​వర్కర్లకు జరుగుతున్న అన్యాయం విషయంలో ప్రభుత్వం, ప్రైవేట్​హాస్పిటల్స్​అనే తేడా లేదు. కొన్ని హాస్పిటళ్లలో పీపీఈ కిట్లు కూడా వాళ్లకు సరిగా అందట్లేవు. పైగా అవి చీరలు కట్టుకునేవాళ్లకు సౌకర్యవంతంగా లేవు.
– ముఖ్యంగా ఆశావర్కర్లు ఈ కరోనా టైమ్​లో చాలా కష్టపడ్డారు.. ఇప్పటికీ రాత్రింబవళ్లు పనిచేస్తూనే ఉన్నారు. అయినా వాళ్లకంటూ జీతభత్యాలు ఉండవు. పనికి తగ్గ పారితోషికం పేరుతో అంతోఇంతో చేతికందిస్తోంది ప్రభుత్వం.

::: ఎన్​ఎన్​