- అధికారుల్లో కరోనా భయం
- సగం మందే విధులకు హాజరు
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తోంది. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని అనేక ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. సీఎం ఉండే ప్రగతిభవన్‌తో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు ఉండే సెక్రటేరియట్, తాజాగా గవర్నర్ నివాస భవనం అయిన రాజ్‌భవన్‌లోకి కూడా ఈ వైరస్ ప్రవేశించింది. దీంతో చాలా మంది ప్రభుత్వ అధికారులు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కొన్ని ఆఫీసులు మూతపడుతున్నాయి.
మిగతా కార్యాలయాల్లో కూడా సగం మందే విధులకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాపాలనకు సంబంధించిన ఫైళ్లు ముందుకు సాగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇందులో కొన్ని అత్యవసరమైనవి కూడా ఉన్నట్టు అధికారవర్గాలు భావిస్తున్నాయి. కరోనా కాలంలో చాలావరకు ఫైళ్లు ఆఫీసుల్లోనే పడి ఉన్నాయని, సిబ్బంది ఆఫీసులకు రాకపోవడంతో అవి అక్కడే పడి ఉంటున్నాయని జనాలు వాపోతున్నారు. కరోనా మరణాలు కూడా ఇటీవల కాలంలో పెరుగుతున్న నేపథ్యంలో ఆఫీసులన్నీ బోసిపోతుండడంతో తమ పనులు ఎలా చేయించుకోవాలోనని రాష్ట్రంలోని చాలా మంది లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.