చెన్నై: ప్రముఖగాయకుడు, గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉన్నదని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తాజాగా హెల్త్‌బులెటిన్‌ను విడుదల చేశాయి. దీంతో ప్రస్తుతం ఎంజీఎం వద్ద తీవ్ర ఉద్విగ్న వాతావరణం నెలకొని ఉన్నది. గురువారం సాయంత్రం నుంచి ఎస్పీ బాలూ ఆరోగ్యం తీవ్రంగా విషమించిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో తెలుగు ప్రజలు, బాలూ అభిమానులు తీవ్ర ఆందోళనగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎంజీఎం దవాఖాన పరిసరాలు మాత్రం కోలాహలంగా మారాయి. ఎంజీఎంకు వెళ్లే దారులన్నీ బాలూ అభిమానులతో నిండిపోయాయి. ఏ క్షణం ఎటువంటి వార్తలు వినాల్సి వస్తుందోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
బాలూ క్షేమంగా ఆస్పత్రి నుంచి తిరిగిరావాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. మరోవైపు బాలు తొందరగా కోలుకోవాలని ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ ట్వీట్ చేశాడు. నిన్న సాయంత్రం నటుడు కమల్‌హాసన్ ఎంజీఎం వెళ్లారు. బాలూ కుటుంబసభ్యులు, బంధువులంతా ఎంజీఎంలో ఉన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా బాలూ ఆరోగ్యంపై ఆరా తీశారు. అయితే త్వరలోనే మరో హెల్త్ బులిటిన్ విడుదల కానుంది. ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనని బాలూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.